Ranji Trophy 2023-24: లార్డ్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షో.. ఫైనల్లో అడుగుపెట్టిన ముంబై

Ranji Trophy 2023-24: లార్డ్ ఠాకూర్ ఆల్‌రౌండ్ షో.. ఫైనల్లో అడుగుపెట్టిన ముంబై

భారత స్టార్ క్రికెటర్ శార్దూల్ ఠాకూర్(109, 4 వికెట్లు) ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ముంబై జట్టు రంజీ ట్రోఫీ 2024 ఫైనల్లో అడుగుపెట్టింది. తమిళనాడుతో జరిగిన సెమీ ఫైనల్ పోరులో ఇన్నింగ్స్, 70 పరుగుల తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ ఠాకూర్ మెప్పించాడు. మొదట శతకం(109: 104 బంతుల్లో 13 ఫోర్లు, 4 సిక్స్ లు) బాది జట్టును కష్టాల నుంచి గట్టెక్కించిన శార్దూల్.. అనంతరం బౌలింగ్ లోనూ కీలక వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

అదే ఆట.. అదే ఫలితం

తొలి ఇన్నింగ్స్ లో 146 పరుగులకే కుప్పకూలిన తమిళనాడు, రెండో ఇన్నింగ్స్ లోనూ అదే ఆటను పునరావృతం చేసింది. 162 పరుగులకే ఆలౌట్ అయ్యింది. సాయి సుదర్శన్(5), జగదీశన్ (0), వాషింగ్టన్ సుందర్(4).. ఇలా తొలి ముగ్గురు బ్యాటర్లు 10 పరుగులలోపే పెవిలియన్ చేరారు. ఆ సమయంలో బాబా ఇంద్రజిత్(70), ప్రదోష్ పాల్(25) జోడి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. నాలుగో వికెట్ కు 73 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, వీరిద్దరూ వెనుదిరిగాక తమిళనాడు ఇన్నింగ్స్ పేకమేడలా కుప్పకూలింది. 3డీ ప్లేయర్ విజయ్ శంకర్(24) పరుగులు చేయగా, కెప్టెన్ సాయి కిషోర్ (21) పరుగులతో కాసేపు పోరాడారు. ముంబై బౌలర్లలో షామ్స్ ములానీ 4 వికెట్లు పడగొట్టగా.. శార్దూల్ ఠాకూర్, మోహిత్ అవస్తి, తనుష్ కోటియన్ తలా రెండు వికెట్లు తీసుకున్నారు. 

232 పరుగుల ఆధిక్యం

అంతకుముందు ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్ లో 378 పరుగుల భారీ స్కోర్ చేసింది. పృథ్వీ షా(5), అజింక్యా రహానె(19), శ్రేయాస్ అయ్యర్(3) వంటి స్టార్లు విఫలమైనా.. లోయర్ ఆర్డర్ బ్యాటర్లు గట్టెక్కించారు. శార్దూల్ ఠాకూర్(109) సెంచరీ చేయగా, తనుష్ కోటియన్(89 నాటౌట్) విలువైన పరుగులు చేశాడు.


సంక్షిప్త స్కోర్లు

  • తమిళనాడు తొలి ఇన్నింగ్స్: 146
  • ముంబై తొలి ఇన్నింగ్స్: 378
  • తమిళనాడు రెండో ఇన్నింగ్స్: 162