- రాణించిన తనయ్, అనికేత్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు : రంజీ ట్రోఫీలో హైదరాబాద్ రెండో విజయం సాధించింది. స్పిన్నర్లు తనయ్ త్యాగరాజన్ (6/118), అనికేత్ రెడ్డి (4/46) విజృంభించడంతో ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ముగిసిన గ్రూప్–బి మ్యాచ్‌లో ఆతిథ్య హైదరాబాద్ ఇన్నింగ్స్ 43 రన్స్ తేడాతో హిమాచల్ ప్రదేశ్‌పై భారీ విక్టరీ సొంతం చేసుకుంది. ఓవర్‌నైట్ స్కోరు 21/0తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) కొనసాగించిన హిమాచల్ 45.4 ఓవర్లలో 247 రన్స్‌కే కుప్పకూలింది. ఓపెనర్ శుభం అరోరా (66), అంకిత్ కాల్సి (44), చివర్లో వైభవ్ అరోరా (32) మాత్రమే ప్రతిఘటించారు.
ఓఎండ్‌లో తనయ్.. మరోవైపు అనికేత్ స్పిన్ దాడికి హిమాచల్ వరుసగా వికెట్లు కోల్పోవడంతో లంచ్ తర్వాత కాసేపటికే మ్యాచ్ ముగిసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 11 వికెట్లు తీసిన అనికేత్‌కు ప్లేయర్ ఆఫ్‌ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విక్టరీతో హైదరాబాద్ బోనస్ సహా ఏడు పాయింట్లు అందుకుంది. మొత్తంగా ఆరు మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. ఈ నెల 30 నుంచి నాగ్‌పూర్‌లో జరిగే చివరి మ్యాచ్‌లో విదర్భతో పోటీ పడనుంది.