Ranji Trophy: రంజీ ట్రోఫీ విజేత విదర్భ

Ranji Trophy: రంజీ ట్రోఫీ విజేత విదర్భ

రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ విజేతగా విదర్భ నిలిచింది. కేరళతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌ 'డ్రా'గా ముగిసినప్పటికీ, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం వల్ల విదర్భ విజేతగా నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 379  పరుగులు చేసిన విదర్భ.. అనంతరం కేరళను తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులకు ఆలౌట్ చేసింది. తద్వారా 37 పరుగుల ఆధిక్యం సాధించింది. ఆ 37 పరుగులే వారిని విజేతగా నిలబెట్టాయి.

విదర్భకిది మూడో రంజీ టైటిల్. 2017-18 సీజన్‌లో  విదర్భ తొలి రంజీ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది. ఫైజ్ ఫజల్ నాయకత్వంలో.. రిషబ్ పంత్ నేతృత్వంలోని ఢిల్లీని 9 వికెట్ల తేడాతో ఓడించి తొలిసారి విజేతగా నిలిచింది. అనంతరం 2018-19 సీజన్‌లో సౌరాష్ట్రను 78 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ నిలబెట్టుకుంది. ఇప్పుడు మూడవది.

గతేడాది కూడా విదర్భ రంజీ ట్రోఫీ ఫైనల్‌లో ఆడింది. కానీ అజింక్య రహానె కెప్టెన్సీలోని ముంబై ముందు వారి పోరాటం సాగలేదు. దాంతో, రన్నరప్‌తో సరి పెట్టుకున్నారు. మరోవైపు, కేరళకు ఇది తొలి రంజీ ట్రోఫీ ఫైనల్.

స్కోర్లు:

  • విదర్భ తొలి ఇన్నింగ్స్‌: 379 ఆలౌట్ (డానిష్ మాలేవర్- 153)
  • కేరళ తొలి ఇన్నింగ్స్‌: 342 ఆలౌట్ (సచిన్ బేబీ- 98) 
  • విదర్భ రెండో ఇన్నింగ్స్: 375/9 (కరుణ్ నాయర్- 135)