ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో మాజీ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ అద్భుత ప్రదర్శన కనపరిచాడు. గోవా తరఫున ఆడుతున్న అర్జున్.. ఎలైట్ గ్రూప్ సీలో భాగంగా చండీఘర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో దుమ్మురేపాడు. 60 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 70 పరుగులు చేశాడు.
ప్రభుదేశాయ్ భారీ శతకం
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గోవా తొలి ఇన్నింగ్స్‌ను 160 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 618 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ సుయాశ్ ప్రభుదేశాయ్(364 బంతుల్లో 18 ఫోర్లు, సిక్స్‌తో 197), దీప్‌రాజ్ గోయంకర్(101 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 115 నాటౌట్) సెంచరీలు బాదారు. దర్సల్ మిశాల్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. నిజానికి అతను బౌలింగ్ ఆల్ రౌండరైనా ఎంతో విలువైన పరుగులు చేసి గోవా భారీ స్కోర్ చేయడంలో సహాయపడ్డాడు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన చండీఘర్ 18 ఓవర్లలో వికెట్ నష్టానికి 73 పరుగులు చేసింది. అర్స్లాన్ ఖాన్(43), హర్నూర్ సింగ్(21) క్రీజులో ఉన్నారు.
భువీ 8 వికెట్లు
ఇక ఆరేళ్ల తర్వాత దేశవాళీ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన భారత సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్.. తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టాడు. రంజీ ట్రోఫీలో ఉత్తరప్రదేశ్‌కు ఆడుతున్న భువీ బెంగాల్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో 8 వికెట్లతో సత్తా చాటాడు. అతని ధాటికి బెంగాల్ జట్టు 188 పరుగులకే కుప్పకూలింది. ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో భువీ 8 వికెట్లు తీయడం ఇదే తొలిసారి.