Ranji Trophy 2024: హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం.. 48 ఓవర్లలో 529 పరుగులు

Ranji Trophy 2024: హైదరాబాద్ బ్యాటర్ల విధ్వంసం.. 48 ఓవర్లలో 529 పరుగులు

ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024లో హైదరాబాద్ జట్టు అద్భుత ఆటతీరు కనపరుస్తోంది. ఈ సీజన్‌లో ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్‌ల్లో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు.. నాలుగో విజయం దిశగా సాగుతోంది. 

తన్మయ్ అగర్వాల్ ట్రిపుల్ సెంచరీ

శుక్రవారం(జనవరి 26) నెక్స్‌జెన్‌ గ్రౌండ్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు వీరవిహారం చేశారు. తొలిరోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 529 పరుగుల భారీ స్కోర్ చేశారు. ఓపెనర్లిద్దరూ పరుగుల వరద పారించారు. తన్మయ్ అగర్వాల్ 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో ట్రిపుల్ సెంచరీ(323 పరుగులు) చేయగా, మరో ఓపెనర్ రాహుల్ సింగ్ (185; 105 బంతుల్లో 26 ఫోర్లు, 3  సిక్స్ లు) తృటిలో డబుల్ సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఈ జోడి తొలి వికెట్‌కు ఏకంగా 345 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. 

హైదరాబాద్ ఓపెనర్ల ధాటికి అరుణాచల్ ప్రదేశ్‌ బౌలర్లకు ప్రేక్షక పాత్ర వహించడం తప్ప మరో అవకాశం లేకపోయింది. ఈ మ్యాచ్ టీ20ని తలపించింది. ఓవర్‌కు 10 నుంచి 15 పరుగుల చొప్పున తన్మయ్- రాహుల్ జోడి పోటీబడి మరీ బాదారు. వీరి ధాటికి అరుణాచల్ బౌలర్లలో ఇద్దరు సెంచరీలు చేశారు. దివ్యాన్స్ యాదవ్ 9 ఓవర్లలో 117 పరుగులు సమర్పించుకోగా.. తెచ్చి డోరియా 9 ఓవర్లలో 101 పరుగులిచ్చాడు.