Tanmay Agarwal: 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీ.. 33 ఫోర్లు, 21 సిక్స్‌లు

Tanmay Agarwal: 147 బంతుల్లోనే ట్రిపుల్ సెంచ‌రీ.. 33 ఫోర్లు, 21 సిక్స్‌లు

ఇంగ్లాండ్ బ్యాటర్ల బజ్‌బాల్ దూకుడు ఎలా ఉంటదో హైద‌రాబాద్ ప్లేయ‌ర్ త‌న్మయ్ అగ‌ర్వాల్ చూపించాడు. నెక్స్‌జెన్‌ గ్రౌండ్ వేదికగా అరుణాచల్ ప్రదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ హైదరాబాదీ వీరవిహారం చేశాడు. 160 బంతుల్లో 33 ఫోర్లు, 21 సిక్సర్ల సాయంతో 323 పరుగులు చేశాడు. 

119 బంతుల్లో డ‌బుల్ సెంచ‌రీ మార్క్ చేరుకున్న తన్మయ్.. ఆ వెంటనే దాన్ని ట్రిపుల్ సెంచరీగా మలిచి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. కేవలం 147 బంతుల్లోనే 300 పరుగుల మార్కును చేరుకున్నాడు. 200 నుంచి 300 పరుగులు చేరుకోవడానికి అతను కేవలం 28 బంతులు తీసుకోవడం గమనార్హం. అతని ఇన్నింగ్స్ మ్యాచ్ హైలైట్స్‌ని తలపించింది. బాల్ అందించటానికి హైదరాబాద్ జట్టు ఆటగాళ్లే బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేయాల్సి వచ్చింది. 

ఈ ఇన్నింగ్స్‌తో త‌న్మయ్ అగ‌ర్వాల్ రెడ్ బాల్ క్రికెట్‌లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా క్రికెటర్ మార్కో మరైస్ పేరిట ఉండేది. 2017లోఈస్ట్ ప్రావిన్స్‌తో జరిగిన దక్షిణాఫ్రికా దేశవాళీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ గేమ్‌లో మరైస్ 191 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ సాధించగా.. తన్మయ్ ఆ రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే, భారత ఫస్ట్‌క్లాస్ క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఇషాన్ కిషన్(14  సిక్స్‌లు) రికార్డును బద్దలు కొట్టాడు. 

ఫస్ట్ క్లాస్ క్రికెట్ చరిత్రలో ఫాస్టెస్ట్ 300 బాదిన ఆటగాళ్లు

  • తన్మయ్ అగర్వాల్ (హైదరాబాద్): 147 బంతుల్లో
  • మార్కో మరైస్ (దక్షిణాఫ్రికా): 191 బంతుల్లో
  • చార్లెస్ మాకార్ట్నీ (ఆస్ట్రేలియా): 221 బంతుల్లో
  • ఫ్రాంక్ వూలీ (మెల్ బోర్న్ క్రికెట్ క్లబ్): 230 బంతుల్లో
  • కెన్ రూథర్‌ఫోర్డ్ (న్యూజిలాండ్): 234 బంతుల్లో 
  • వివియన్ రిచర్డ్స్ (సోమర్‌సెట్): 244 బంతుల్లో

త‌న్మయ్ అగ‌ర్వాల్ తో పాటు మరో ఓపెనర్ రాహుల్ సింగ్ (185; 105 బంతుల్లో 26 ఫోర్లు, 3  సిక్స్ లు) భారీ శతకం బాదడతో హైద‌రాబాద్ జట్టు తొలిరోజు ఆట ముగిసే సమయానికి 48 ఓవర్లలో వికెట్ నష్టానికి 512 పరుగుల భారీ స్కోర్ చేసింది. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకు ఆలౌట్ అయ్యింది.