కూతురు మృతి.. దుఃఖాన్ని దిగమింగి సెంచరీ చేశాడు

కటక్‌ : ఓ వైపు బిడ్డ చనిపోయిందన్న బాధ ఉన్నా.. టీమ్ కోసం బ్యాట్ పట్టక తప్పలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఆ క్రికెటర్  కూతురు చనిపోయిన దుఃఖాన్ని దిగమింగి సెంచరీ చేశాడు. అందరిచేత పరామర్శలతో పాటు.. ప్రశంసలు అందుకుంటున్నాడు. అతడే  బరోడా బ్యాటర్‌ విష్ణు సోలంకి. అతడి అంకితభావాన్ని అంతా కొనియాడుతున్నారు. ఇటీవల సోలంకికి కుమార్తె జన్మించగా దురదృష్టవశాత్తు ఆమె మరణించింది. ఆ సమయంలో అతడు జట్టుతో కలిసి భువనేశ్వర్‌లో ఉన్నాడు. ఆ విషాద వార్త తెలిసిన వెంటనే వడోదర వెళ్లిన విష్ణు..కుమార్తె అంత్యక్రియల్లో పాల్గొని మూడు రోజుల తర్వాత తిరిగి భువనేశ్వర్‌ వచ్చాడు. క్వారంటైన్‌లో ఉండాల్సి రావడంతో బెంగాల్‌తో ఫస్ట్ మ్యాచ్ కు అతడు దూరంగా ఉన్నాడు. ఎంతో బాధలో ఉన్న సోలంకి.. దానిని దిగమింగి, చండీగఢ్‌ తో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బరోడా తరపున ఐదోస్థానంలో బ్యాటింగ్ చేశాడు. బరోడా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో (104) సెంచరీ చేసి టీమ్ భారీ స్కోరుకు దోహదం చేశాడు.

విష్ణు సోలంకి భార్య ఈ నెల 11న ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ సంతోషకరమైన వార్త అందగానే విష్ణు ఇంటికి చేరుకున్నాడు. దాంతో బరోడా ఫస్ట్ రంజీ మ్యాచ్‌ లో విష్ణు ఆడలేకపోయాడు. దురదృష్టవశాత్తు పుట్టిన 24 గంటల్లోనే చిన్నారి చనిపోయింది. చిన్నారి అంత్యక్రియలకు విష్ణు ఇంటి వద్దే ఉండిపోయాడు. పుట్టెడు దుఃఖంలోనే విష్ణు చివరిరోజున టీమ్ లో చేరాడు. చండీగఢ్‌పై సెంచరీ సాధించిన విష్ణు.. ఆ ఘనతను చనిపోయిన తన కుమార్తెకు అంకితమిచ్చాడు. 104 పరుగుల వద్ద ఔటైన విష్ణు.. తొలి ఇన్నింగ్స్‌లో 517 పరుగుల భారీ స్కోరుతో బరోడాను ముందుంచాడు. చనిపోయిన తన కుమార్తెను తలుచుకుంటూ కూర్చోకుండా తన సంకల్పాన్ని గుర్తు చేసుకొని జట్టును అగ్రభాగాన నిలిపాడు.  వ్యక్తిగత విషాదాన్ని అధిగమించి సెంచరీ సాధించిన సోలంకిని బరోడా క్రికెట్‌ సంఘం కొనియాడింది. అటు సోషల్ మీడియాలో సోలంకిని అంకితభావాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ సెంచరీ అతడి కూతురికి ఘన నివాళి అంటుూ ట్వీట్ చేశారు. ఈ మ్యాచ్ ఆదివారం డ్రాగా ముగిసింది. బరోడా స్కోర్ 517 పరుగులు చేసి ఆలౌట్ కాగా.. చండీగఢ్‌ 7 వికెట్లు కోల్పోయి 473 పరుగులు సాధించి మ్యాచ్ ను డ్రా చేసింది.

ఇవి కూడా చదవండి: 

కెప్టెన్ గా టీ20ల్లో రోహిత్ నయా రికార్డ్

ఖాకీ చొక్కా, ఖాకీ ప్యాంట్.. ధోని న్యూలుక్ అదిరింది