
నాగ్‌పూర్: విదర్భతో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఫైనల్లో కేరళ నిలకడగా ఆడుతోంది. ఆదిత్య సర్వాటే (66 బ్యాటింగ్), అహ్మద్ ఇమ్రాన్ (37) రాణించడంతో.. గురువారం రెండో రోజు ఆట ముగిసే టైమ్‌కు కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 39 ఓవర్లలో 131/3 స్కోరు చేసింది. ఆదిత్యతో పాటు సచిన్ బేబీ (7 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. స్టార్టింగ్‌లో విదర్భ బౌలర్లు చెలరేగడంతో.. అక్షయ్ చంద్రన్ (14), రోహన్ కున్నుమల్ (0) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. దీంతో 14/2తో కష్టాల్లో పడిన ఇన్నింగ్స్‌ను ఆదిత్య, ఇమ్రాన్ మూడో వికెట్‌కు 93 రన్స్ జోడించి ఆదుకున్నారు. దర్శన్ నల్కండే 2, యష్ ఠాకూర్ ఒక్క వికెట్ తీశారు.
అంతకుముందు 254/4 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోజు ఆట కొనసాగించిన విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 123.1 ఓవర్లలో 379 రన్స్‌కు ఆలౌటైంది. డానిష్ మాలేవర్ (153) కెరీర్ బెస్ట్ స్కోరు సాధించగా, నచికేత్ భూటే (32), యష్ ఠాకూర్ (25), అక్షయ్ వాడ్కర్ (23)ఫర్వాలేదనిపించారు. అక్షయ్ కర్నేవార్ (12), హర్ష్ దూబే (12 నాటౌట్) ఓ మాదిరిగా ఆడారు. నిదీశ్, ఆపిల్ టామ్ చెరో మూడు, బాసిల్ రెండు వికెట్లు పడగొట్టారు. ప్రస్తుతం కేరళ ఇంకా 248 రన్స్ వెనకబడి ఉంది.