ముంబై: ఆస్ట్రేలియా టూర్‌లో నిరాశపర్చిన టీమిండియా స్టార్ ప్లేయర్లు ఇప్పుడు ఫామ్ కోసం రంజీ మ్యాచ్‌లపై దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలో నేటి నుంచి మొదలయ్యే తొలి అంచె పోటీల్లో రోహిత్ శర్మ, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, శుభ్‌మన్ గిల్ తమ డొమెస్టిక్ జట్ల తరఫున బరిలోకి దిగుతున్నారు. పదేళ్ల కిందట చివరి రంజీ మ్యాచ్ ఆడిన రోహిత్.. జమ్మూ కశ్మీర్‌తో జరిగే మ్యాచ్‌లో బ్యాట్ ఝుళిపించేందుకు రెడీ అవుతున్నాడు. యశస్వి జైస్వాల్‌తో కలిసి ఓపెనింగ్ చేసే చాన్స్ ఉంది. చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో హిట్‌మ్యాన్ ఫామ్‌లోకి రావడం అత్యవసరం.
అజింక్యా రహానే నేతృత్వంలో ముంబై బరిలోకి దిగనుంది. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20, విజయ్ హజారే ట్రోఫీ నేపథ్యంలో రంజీని రెండు భాగాలుగా విడదీశారు. తొలి అంచెలో ప్రతీ జట్టు ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. రెండో రౌండ్‌లో మరో రెండు మ్యాచ్‌లు ఆడనుంది. దీంతో స్టార్లతో పాటు టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న ఇతర ప్లేయర్లు కూడా ఈ మ్యాచ్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మెడ నొప్పితో విరాట్ కోహ్లీ ఢిల్లీ ఆడే తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. అయితే సౌరాష్ట్రతో జరిగే ఈ మ్యాచ్‌లో పంత్, జడేజా, చతేశ్వర్ పుజారా మధ్య గట్టి పోటీ జరగనుంది. ఇక వన్డేలకు కొత్త వైస్ కెప్టెన్‌గా ఎంపికైన గిల్ పంజాబ్ తరఫున ఆడనున్నాడు. కర్నాటకతో జరిగే ఈ మ్యాచ్‌లో తన బ్యాట్ పవర్ చూపెట్టాలని భావిస్తున్నాడు. దేవదత్ పడిక్కల్, ప్రసిధ్ కృష్ణ, అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్, ఆకాశ్ దీప్, అభిమన్యు ఈశ్వరన్ కూడా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నారు.