Ranji Trophy: తిప్పేసిన జడేజా.. ఒక్కడే 12 వికెట్లు.. ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం

Ranji Trophy: తిప్పేసిన జడేజా.. ఒక్కడే 12 వికెట్లు.. ఢిల్లీపై సౌరాష్ట్ర విజయం

జడ్డూ ఆస్ట్రేలియా పర్యటనలో వికెట్ల వేటలో వెనుకబడినప్పటికీ, స్వదేశంలో మాత్రం దుమ్మురేపాడు. రంజీ ట్రోఫీలో భాగంగా ఢిల్లీతో జరిగిన మ్యాచ్ లో సౌరాష్ట్ర తరుపున బరిలోకి దిగిన జడ్డూ 12 వికెట్లతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 5.. రెండో ఇన్నింగ్స్‌లో 7.. మొత్తంగా 12 వికెట్లు పడగొట్టాడు. దాంతో, సౌరాష్ట్ర 10 వికెట్ల తేడాతో అలవోకగా విజయం సాధించింది. 

పంత్ అదే తడబాటు

రంజీల్లోనూ పంత్ ఆట మారడం లేదు. పసలేని దేశవాళీ బౌలర్లను చితక్కొడతాడనుకుంటే.. అందరి కన్నా ముందే ఔటై డగౌట్‌లో సేద తీరాడు. తొలి ఇన్నింగ్స్‌లో 1, రెండో ఇన్నింగ్స్‌లో 17 పరుగులు చేశాడు. ఢిల్లీ బ్యాటర్లలో ఆయుష్ బదోని(60, 44) ఒక్కడూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో జడ్డూ 5 వికెట్లతో చెలరేగడంతో ఢిల్లీ 188 పరుగులకే కుప్పకూలింది. అనంతరం సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసి 83 పరుగుల ఆధిక్యం సాధించింది. 

ALSO READ | Team India: కెప్టెన్‌గా కాదు.. స్ఫూర్తినింపే నాయకుడిగా ఉండాలనుకుంటున్నా..: సూర్య

83 పరుగుల వెనుకంజతో రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఢిల్లీని జడేజా మరోసారి బెంబేలెత్తించాడు. ఈసారి ఏకంగా 7 వికెట్లు పడగొట్టడంతో.. ఢిల్లీ  94 పరుగులకే కుప్పకూలింది. సౌరాష్ట్ర ఎదుట 12 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. దానిని సౌరాష్ట్ర బ్యాటర్లు వికెట్ నష్టపోకుండా 3 ఓవర్లలోనే ఛేదించారు.