నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. DGP రామచంద్ర రావుపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం

నటి రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. DGP రామచంద్ర రావుపై దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశం

బెంగుళూర్: నటి, డీజేపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో డీజేపీ రామచంద్ర రావు పాత్రపై కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను విచారణాధికారిగా నియమించింది. ఈ మేరకు సోమవారం (మార్చి 10) ముఖ్యమంత్రి కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వారం రోజుల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని గౌరవ్ గుప్తాను ప్రభుత్వం ఆదేశించింది.

కాగా, నటి, డీజేపీ రామచంద్ర రావు కూతురు రన్యా రావు గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. 2025, మార్చి 3న దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తరలిస్తుండగా కెంపెగౌడ ఎయిర్ పోర్టులో డీఆర్ఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో రన్యా రావును డీఆర్ఐ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. విదేశాల నుంచి అక్రమంగా బంగారం తీసుకొస్తోన్న రన్యా రావు.. ఎయిర్ పోర్టులో తన త్రండి ప్రోటోకాల్ ఉపయోగించుకుందని అధికారుల విచారణలో తేలింది. ఈ ఆరోపణల నేపథ్యంలో డీజేపీ రామచంద్రరావుపై కర్నాటక ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 

నేను షాకయ్యా: రామచంద్రరావు

గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు రన్యా రావు అరెస్ట్‎ కావడంపై ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు స్పందించారు. మీడియా ద్వారానే ఈ విషయం నా దృష్టికి వచ్చిందని.. విషయం తెలియగానే నేను కూడా షాక్ అయ్యానని తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఏవి తనకు తెలియదని.. ఇతర తండ్రుల్లాగానే నా కూతురు అరెస్ట్ అయ్యిందని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని చెప్పారు. ఈ విషయం గురించి తనకు ఎలాంటి ముందస్తు సమాచారం లేదని క్లారిటీ ఇచ్చారు. 

ఎవరి విషయంలోనైనా చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. నా కెరీర్‌పై ఇప్పటి వరకు ఎలాంటి నల్ల మచ్చ లేదన్నారు. ప్రస్తుతం తన కూతురు తమతో కలిసి ఉండటం లేదని.. తన భర్తతో కలిసి వేరే ఉంటుందని తెలిపారు. కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల తమకు దూరంగా ఉంటుందని చెప్పారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో తన కూతురు అరెస్ట్ వ్యవహారానికి తాను దూరంగా ఉంటానని.. ఇందులో తాను కలగజేసుకోనని స్పష్టం చేశారు.

రన్యా రావు ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు రెండో భార్య కుమార్తె. రామచంద్రరావు తన మొదటి భార్య మరణించిన తర్వాత తిరిగి మరో మహిళను వివాహం చేసుకున్నారు. ఆయన రెండో భార్యకు ఇద్దరు ఆడ పిల్లలు. ఇందులో గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన రన్యా రావు ఒకరు. 

Also Read :- హైదరాబాద్లోని లేడీస్ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య