హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ భద్రకాళి బండ్ టెండర్లలో గోల్ మాల్ జరిగిందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ ఆరోపించారు. హంటర్ రోడ్డులోని పార్టీ జిల్లా ఆఫీస్‌లో బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు. మూడు కంపెనీలు భద్రకాళి బండ్‌కు టెండర్ దాఖలు చేస్తే.. ఇక్కడి టీఆర్ఎస్ నాయకులు కమీషన్లకు కక్కుర్తి పడి తక్కువ కోట్ చేసిన వారికి కట్టబెట్టారని మండిపడ్డారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేవలం కమీషన్ల కోసమే పని చేస్తున్నారని, కుడా ఆఫీసర్లు కూడా వారితో కుమ్మక్కై తక్కువ ఆదాయం వచ్చే కంపెనీకి టెండర్ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. ఒకటో తేదీన వరంగల్ కు వస్తున్న సీఎం కేసీఆర్ ఈ టెండర్లపై దృష్టి పెట్టి, వెంటనే భద్రకాళి టెండర్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గురుమూర్తి శివ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శులు దేశిని సదానందం గౌడ్, ఆర్పీ జయంత్ లాల్, కొండి జితేందర్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి, ఉపాధ్యక్షులు కందగట్ల సత్యనారాయణ తదితరులున్నారు.
విభజన హామీలు అమలు చేయాలి
జనగామ, వెలుగు: విభజన హామీలను కేంద్రం వెంటనే అమలు చేయాలని టీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ పాగాల సంపత్ రెడ్డి డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం జనగామ ఆర్టీసీ చౌరస్తాలో టీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ దహనం చేశారు. అనంతరం సంపత్ రెడ్డి మాట్లాడారు. కేంద్ర సర్కారు తెలంగాణ పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు. మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎడవెల్లి కృష్ణా రెడ్డి, వారాల రమేష్, మదార్, బెలిదె వెంకన్న, మహేందర్ రెడ్డి, సేవల్లి సంపత్, నాగేందర్, బండ యాదగిరి రెడ్డి తదితరులున్నారు.
ముల్కనూర్ రైతులకు రూ.2.25 కోట్ల బోనస్
భీమదేవరపల్లి, వెలుగు: ముల్కనూర్ సొసైటీ రైతులకు ఈ ఏడాది రూ.2.25కోట్ల బోనస్ ఇస్తున్నట్లు సొసైటీ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి వెల్లడించారు. బుధవారం సంఘంలోని పారాబాయిల్డ్ మిల్లు ఆవరణలో సొసైటీ 66వ వార్షిక మహాసభ నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా ప్రవీణ్ రెడ్డి హాజరై మాట్లాడారు. సభ్యుల సంక్షేమం, పంట రుణమాఫీ, వృద్ధాప్య పెన్షన్, దహన ఖర్చులు, సభ్యుల పిల్లలకు ఇప్పటివరకు రూ.8 కోట్లు ఖర్చు చేశామన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లో రైతులు పండించిన వరి క్వింటాలుకు రూ.125, పత్తి క్వింటాలుకు రూ.350 చొప్పున బోనస్ చెల్లిస్తామన్నారు. ఈ ఏడాది రూ.125 కోట్ల మేర అప్పుల పంపిణీకి పాలకవర్గం ఆమోదించిందన్నారు. అంతకుముందు సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు కేవీఆర్ చిత్రపటానికి నివాళి అర్పించారు. సంఘ కార్యదర్శి రాజమౌళి నివేదిక చదివి వినిపించారు. జీఎం రాంరెడ్డి, పాలకవర్గ సభ్యులు, ఎల్కతుర్తి సీఐ శ్రీనివాస్ పాల్గొన్నారు.
గాయత్రి మాతగా భద్రకాళి అమ్మవారు
వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ భద్రకాళి అమ్మవారు మూడో రోజైన బుధవారం గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఉదయం ఆమ్మవారిని దుర్గామాత అవతారంలో సింహవాహనంపై ఊరేగించారు. సాయంత్రం లక్ష్మీదేవిగా అలంకరించి గజవాహనంపై ఊరేగించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, అమ్మవారిని దర్శించుకున్నారు.
ములుగులో..
ములుగు: ములుగు రామాలయంలో కొలువుదీరిన దుర్గామాత మూడో రోజు గాయత్రి మాతగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి పోతంశెట్టి మోహన్‌రావు దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు సముద్రాల శ్రీనివాసాచార్యులు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్‌రెడ్డి, సభ్యులు బండారు మోహన్ కుమార్, నగరపు రమేశ్, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మందల విజయ్ కుమార్ రెడ్డి, సీహెచ్ చిన్నకొండారెడ్డి ఉన్నారు.
దొడ్డి కొమురయ్య చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి
బచ్చన్నపేట, వెలుగు: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు సేవెళ్ల సంపత్, కాంగ్రెస్ లీడర్ బీర్ల ఐలయ్య డిమాండ్‌చేశారు. జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నాగిరెడ్డిపల్లిలో దొడ్డి కొమురయ్య విగ్రహాన్ని బుధవారం వారు ఆవిష్కరించారు. కొమురయ్య చరిత్ర రాబోయే తరాలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. సర్పంచ్భవాణి, రైతుబంధు జిల్లా కన్వీనర్ఇర్రి రమణారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బేజాటి బీరప్ప తదితరులున్నారు.
రైతుపై కాంట్రాక్టర్ దాడి!
మరిపెడ, వెలుగు: ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు విషయంలో ఓ రైతుపై కాంట్రాక్టర్ దాడి చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడలో జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని బోడ అమృతండాకు చెందిన రైతు గుగులోతు రామోజీ(40) కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం కరెంట్ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నాడు. ఆఫీసులోని విద్యుత్ శాఖకు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్ ఉమేశ్ లంచం డిమాండ్ చేశాడు. తాను ఇవ్వలేనని ఏఈకి ఫిర్యాదు చేశాడు. స్పందించిన ఏఈ, సదరు కాంట్రాక్టర్ ను మందలించాడు. ఈక్రమంలో రైతుకు, కాంట్రాక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. రైతుపై కాంట్రాక్టర్ దాడి చేసి, గాయపరిచాడు. దీంతో రైతు రామోజీ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కాంట్రాక్టర్ ఉమేశ్ మాట్లాడుతూ.. తాను ఎలాంటి లంచం తీసుకోలేదని, రైతు వ్యక్తిగతంగా తిట్టడం వల్లే చేయి చేసుకోవాల్సి వచ్చిందన్నారు.
సరికొత్త క్రీడా పాలసీ రూపొందిస్తాం
తొర్రూరు, వెలుగు: రాష్ట్రంలో సరికొత్త క్రీడా పాలసీని రూపొందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, క్రీడల్లో రాణిస్తే బంగారు భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ జడ్పీ హైస్కూల్లో స్టేట్ లెవల్ అండర్–19 షూటింగ్ బాల్ పోటీలు నిర్వహించగా.. చీఫ్ గెస్టుగా మంత్రి హాజరై ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్ చంద్ర పవర్ లతో కలిసి సభలో పాల్గొన్నారు. క్రీడల్లో రాణిస్తే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయన్నారు. షూటింగ్ బాల్ క్రీడకు 2శాతం రిజర్వేషన్ కల్పించేలా కృషి చేస్తామన్నారు.
తొర్రూరులో మూడెకరాల్లో ప్లే గ్రౌండ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల అభివృద్ధికి దేశంలోనే అత్యుత్తమ పాలసీని రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తుందన్నారు. పాలసీ తయారీ, మౌలిక సదుపాయాల కల్పన కోసం కేబినెట్ సబ్ కమిటీని నియమించిందన్నారు. ఈ కమిటీ విదేశాల్లో పర్యటించి, ఆయా దేశాల పాలసీలను పరిశీలిస్తుందన్నారు. అందులో ముఖ్యాంశాలను తీసుకుని, బెస్ట్ పాలసీని రూపొందిస్తుందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రీడాకారులకు రూ. 25.87 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని ప్రభుత్వం అందించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఒక పెద్ద గ్రౌండ్ ను నిర్మిస్తామన్నారు. కాగా, ఈ పోటీలకు 28 జిల్లాల నుంచి 678 మంది క్రీడాకారులు,100 కోచ్ లు పాల్గొన్నారు. కార్యక్రమంలో తొర్రూరు ఆర్డీవో రమేశ్, డీఈవో అబ్దుల్ హై, డీఎస్పీ రఘుబాబు, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు, తహసీల్దార్ రాఘవరెడ్డి, టీఆర్ఎస్ లీడర్లు పాల్గొన్నారు.
ఓవర్ లోడ్ లారీలను సీజ్ చేయాలి
ములుగు, వెలుగు: ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేయాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆఫీసర్లను ఆదేశించారు. ఇసుక రీచ్ ల వద్ద వే బిల్ వివరాలతో కూడిన ఫ్లెక్సీలను ఏర్పాటు చేయాలన్నారు. బుధవారం కలెక్టరేట్ లో మైనింగ్ ఆఫీసర్లతో జిల్లా స్థాయి ఇసుక కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఇసుక లారీల రూట్ మ్యాప్వివరాలను అందజేయాలన్నారు. రాత్రి సమయంలో ఇసుక తరలిస్తే చర్యలు తప్పవన్నారు. చెక్ పోస్టుల వద్ద సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు.
టీఆర్ఎస్ లీడర్లవి ఉత్తుత్తి ధర్నాలే
హనుమకొండ సిటీ, వెలుగు: వరంగల్ అభివృద్ధి కోసం ఏనాడూ నోరెత్తని టీఆర్ఎస్ నేతలు, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఆర్టిఫీషియల్ ధర్నాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ నేతల తీరుపై ఫైర్ అయ్యారు. చీఫ్ విప్ వినయ్ భాస్కర్, ఎమ్మెల్యేలు నన్నపనేని నరేందర్ చేసిన ధర్నాలో ఖద్దర్, ఖాకీ చొక్కాలు తప్ప కష్టజీవులు లేరన్నారు. రాజకీయ స్వార్థంతో రోడ్డెక్కిన అధికార పార్టీ నేతలు వరంగల్ రింగ్ రోడ్డు, కాళోజీ కళా క్షేత్రం, వరంగల్ మాస్టర్ ప్లాన్, డంపింగ్ యార్డ్ సమస్యలతో పాటు వరంగల్ కు ఏటా 300 కోట్ల బడ్జెట్ ఇస్తానని సీఎం ఇచ్చిన మాట కోసం కొట్లాడితే బాగుటుందన్నారు.
హైదరాబాద్ లో ఇచ్చిన వరద సాయం వరంగల్ లోని బాధితుల కోసం ఇప్పించేందుకు రోడ్డెక్కితే బాగుండేదన్నారు. కాజీపేట కోచ్‌ఫ్యాక్టరీ విషయంలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, 2013 లో అప్పటి యూపీఏ ప్రభుత్వం కాజీపేట కు కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేస్తే ఎమ్మెల్యే గా ఉన్న వినయ్ భాస్కర్ కనీసం స్థలం చూపించలేకపోయారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేని విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇకనైనా టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు.
సమస్యలపై సభ్యుల నిలదీత
జనగామ, వెలుగు: జనగామ మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో పట్టణ సమస్యలపై కౌన్సిలర్లు నిలదీశారు. మున్సిపల్‌చైర్‌పర్సన్ పోకల జమున లింగయ్య అధ్యక్షతన మున్సిపల్కాన్ఫరెన్స్ హాల్ లో బుధవారం మీటింగ్ నిర్వహించారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా కృషి చేయాలన్నారు. అంతకుముందు కౌన్సిలర్లు వార్డుల్లోని సమస్యలను విన్నవించారు. మహంకాళి హరిశ్చంద్ర గుప్త మాట్లాడుతూ.. ఉప్పలమ్మ గుడి ప్రాంతంలో వర్షం నీళ్లు ఇండ్లలోకి వెళ్తున్నాయన్నారు. ఉడుగుల శ్రీలత పట్టణంలో బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని కోరారు. బండ పద్మ మాట్లాడుతూ.. పోచమ్మ గుడి దగ్గర లైట్లు వేయమని ఆఫీసర్లకు చెప్పినా పట్టింపు కరువైందన్నారు. గాడిపెల్లి ప్రేమలతా రెడ్డి మాట్లాడుతూ.. మున్సిపల్ నిధులను ఇతర సంస్థలకు, శాఖలకు వినియోగించవద్దన్నారు. జక్కుల అనిత మాట్లాడుతూ 17వ వార్డులో పోల్స్ వేయాలని విన్నవించినా ఇంతవరకు పనులు కాలేదన్నారు.
ఆడిట్ పై అధికార పార్టీ కౌన్సిలర్ల లొల్లి..
మున్సిపల్ ఆదాయ వ్యయాలపై ఆడిట్ నిర్వహించే వరకు బిల్లుల చెక్కులు నిలిపి వేయాలని టీఆర్ఎస్ కౌన్సిలర్ తాళ్ల సురేశ్ రెడ్డి డిమాండ్ చేశారు. ఆపమని మీరెవరంటూ అధికార పార్టీ ఫ్లోర్‌లీడర్ పాండు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంలొ ఈ ఇరువురు సభ్యులు తీవ్ర వాగ్వాదం చేసుకున్నారు. ఇదిలా ఉండగా కౌన్సిల్ లో 27 అంశాలను ఆమోదించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రజిత, వైస్ చైర్మన్ మేకల రాంప్రసాద్ ఉన్నారు.
సీసీ కెమెరాలతో భద్రత
బచ్చన్నపేట, వెలుగు: సీసీ కెమెరాలతో భద్రతతో పాటు నేరాలు తగ్గుతాయని జనగామ డీసీపీ సీతారాం అన్నారు. బుధవారం బచ్చన్నపేట మండలం పోచన్నపేటలో
రూ.2.25లక్షలతో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. గ్రామస్తులు సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఒక్క కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. వీటివల్ల గ్రామం మొత్తం నిఘా నీడలో ఉంటుందన్నారు. అనంతరం దాతలను శాలువాలతో సన్మానించారు. సర్పంచ్ గట్టు మంజుల, ఎంపీటీసీ అరుణ, ఏసీపీ దేవేందర్‌రెడ్డి, నర్మెట్ట సీఐ నాగబాబు, ఎస్సైలు నవీన్‌కుమార్, సృజన్‌కుమార్, కొన్నె సర్పంచ్ వేముల వెంకట్‌గౌడ్ తదితరులున్నారు.
పీహెచ్ సీ పనితీరు మారాలి
పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లా పర్వతగిరి పీహెచ్ సీని బుధవారం జడ్పీటీసీ సింగులాల్ తనిఖీ చేశారు. ఇటీవల ఆసుపత్రి సేవలపై ఫిర్యాదులు వస్తున్నాయని, సిబ్బంది పనితీరు మార్చుకోవాలని సూచించారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. నిత్యం వచ్చే రోగులకు మంచి సేవలు అందించాలని సూచించారు. అనంతరం హాస్పిటల్ లోని సౌలతులపై ఆరా తీశారు. ఎంపీపీ కమలపంతులు, వైస్‌ఎంపీపీ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్ చైర్మన్ మనోజ్, జడ్పీ కోఆప్షన్ సర్వర్, సర్పంచ్ చింతపట్ల మాలతిసోమేశ్వర్రావు, ఎంపీటీసీ రాజు, తహసీల్దార్ కోమి, ఎంపీడీవో సంతోష్‌కుమార్ తదితరులున్నారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు
రేగొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. బుధవారం రేగొండ మండలంలో ఆసరా పెన్షన్ కార్డులను ఆయన పంపిణీ చేశారు. ప్రతిపక్షాలు ప్రతీది రాజకీయం చేస్తూ అభివృద్ధి నిరోధకాలుగా మారాయన్నారు. ఆయన వెంట ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు అంకం రాజేందర్, మటికె సంతోష్, నడిపెల్లి శ్రీనివాస్‌రావు, మోడెం ఉమేశ్, మైస భిక్షపతి, జూపాక నీలాంబరం తదితరులున్నారు.
టూవీలర్ ను ఢీకొన్న లారీ.. మహిళ మృతి
హసన్ పర్తి, వెలుగు: హనుమకొండ హసన్ పర్తి మండలం చింతగట్టు బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టూవీలర్ ను ఓ లారీ ఢీకొట్టడంతో ఓ మహిళ చనిపోగా.. ఆమె భర్త చికిత్స పొందుతున్నాడు. కేయూ సీఐ దయాకర్ వివరాల ప్రకారం.. కమలాపూర్ మండలం ఉప్పల్ గ్రామానికి చెందిన బండారి ఓదెలు, భార్య బండారి కొమురమ్మ(48) తమ మనవడి బర్త్ డే కోసమని టీవీఎస్ ఎక్స్ ఎల్ పై బుధవారం ఉదయం హనుమకొండకు వెళ్లారు. హసన్ పర్తి మండలం చింతగట్టు బ్రిడ్జి వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో కొమురమ్మ చనిపోగా.. ఓదెలుకు గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత కుటుంబానికి పరామర్శ
శాయంపేట, వెలుగు: శాయంపేట మండలకేంద్రానికి చెందిన మేకల వెంకటేశ్వర్లు ఇటీవల మృతిచెందగా ఆయన కుటుంబసభ్యులను భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణరావు పరామర్శించారు. బుధవారం వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లి కుటుంబసభ్యులన ఓదార్చారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు రవిపాల్, మార్కండేయ తదితరులు ఉన్నారు.