రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతుందని బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ హనుమకొండ జిల్లా పర్యటన సందర్భంగా వందలాది మంది బీజేపీ నాయకులను ముందస్తు అరెస్ట్ లు చేశారు. ఈ నేపథ్యంలో హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మని హన్మకొండలో హౌస్ అరెస్ట్ చేశారు.
మీకెందుకు భయం...
కేసీఆర్, కేటీఆర్ క్యాంప్ ఆఫీస్ దాటితే విపక్ష నేతల అరెస్టా? అని రావు పద్మ ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల నాయకులను అరెస్టు చేసి, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలు చేసుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వం తరపున అభివృద్ధి చేస్తే మీకెందుకు భయమని ఆమె ప్రశ్నించారు. చుట్టూ పోలీసు బలగాలు ఉన్నా.. కేసీఆర్ కుటుంబం అడుగు బయటపెట్టడానికి భయపడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో నియంత, నిజాంను మించి కేసీఆర్ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని అన్నారు.
రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని పక్కనపెట్టి.. కల్వకుంట్ల కుటుంబ రాజ్యాంగాన్ని అధికార పార్టీ అమలు చేస్తోందని రావు పద్మ తెలిపారు. వచ్చే ఎన్నికలలో కేసీఆర్ కు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. అక్రమ అరెస్టులకు బీజేపీ భయపడేది లేదని రావు పద్మ స్పష్టం చేశారు. అరెస్టు చేసిన వారందరిని భేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు.