మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), యంగ్ డైరెక్టర్ వశిష్ట(Vassishta) కాంబోలో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం విశ్వంభర(Vishwambhara). యూవీ క్రియేషన్స్(UV Creations) సంస్థ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో చెన్నై చిన్నది త్రిష(Trisha) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటీవలే లాంఛనంగా మొదలైన ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జవనరి 10న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు.
ఇదిలా ఉంటే.. ఈ ప్రెస్టీజియస్ సినిమా గురించి రోజుకో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమా మూడు లోకాల చుట్టూ తిరుగుతుందని, చిరంజీవికి ఐదుగురు చెల్లెల్లు ఉంటారని, వారి నేపధ్యంలోనే సినిమా అంతా నడుస్తుందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా నుండి మరో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ సినిమాలో విలన్ గా రావు రమేష్ చేయనున్నారట. ఆయన పాత్ర కూడా చాలా కొత్తగా ఉండబోతుందని సమాచారం. ఆయన లుక్ కూడా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడట దర్శకుడు వశిష్ట.
నిజానికి ఆ పాత్ర కోసం చాలా మంది నటులను అనుకున్నారట కానీ, మెగాస్టార్ మాత్రం రావు రమేష్ అయితేనే పర్ఫెక్ట్ గా ఉంటుందని చెప్పారట. దాంతో రావు రమేష్ ను ఫిక్స్ చేశాడట వశిష్ట. ఈ విషయంపై కూడా త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా.. చోటా కే నాయుడు కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నారు. సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ తో, భారీ గ్రాఫిక్ హంగులతో వస్తున్న ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయనుంది చూడాలి.