Maruthi Nagar Subramanyam Review: మారుతీ నగర్ సుబ్రమణ్యం’ రివ్యూ..రావు రమేష్ నటించిన మూవీ ఎలా ఉందంటే?

Maruthi Nagar Subramanyam Review: మారుతీ నగర్ సుబ్రమణ్యం’ రివ్యూ..రావు రమేష్ నటించిన మూవీ ఎలా ఉందంటే?

విలక్షణ నటుడు రావు రమేష్‌ (Rao Ramesh) ప్రధాన పాత్రధారిగా పీబీఆర్‌ సినిమాస్‌ పతాకంపై తెరకెక్కిన చిత్రం ‘మారుతీనగర్‌ సుబ్రహ్మణ్యం’ (Maruti Nagar Subramanyam). లక్ష్మణ్‌ కార్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం (ఆగస్టు 23న) థియేటర్లలలో విడుదలైంది.

స్టార్ డైరెక్టర్ సుకుమార్ స‌తీమ‌ణి త‌బిత రిలీజ్‌ చేస్తుండ‌టంతో మారుతి నగర్ సుబ్రమ‌ణ్యంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే, ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్, సుకుమార్ రావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉండగా..రిలీజ్ అయ్యాక ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో రివ్యూలో చూద్దాం. 

కథేంటంటే :: 

ప్ర‌భుత్వ ఉద్యోగం చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంటాడు మారుతీన‌గ‌ర్‌కు చెందిన సుబ్రమ‌ణ్యం(రావుర‌మేష్‌).డీఎస్‌సీ పరీక్ష రాసిన‌ సుబ్రహ్మణ్యంకి జాబ్ వస్తుంది. కానీ, కోర్టు కేసు కారణంగా జాయినింగ్ ఆగిపోతుంది. గవర్నమెంట్ జాబ్ లక్ష్యంగా వచ్చిన ప్రతి జాబ్ అప్లై చేస్తూ ఉన్నా ఏది రాదు. అలాగే టీచర్ జాబ్ ఎప్పుడొస్తుందని ఎదురుచూస్తూ ఉంటాడు. దాంతో భార్య క‌ళారాణి (ఇంద్ర‌జ‌) సంపాద‌నపైనే ఆధార‌ప‌డుతూ కాలం వెళ్ల‌దీస్తుంటాడు. అబ్బాయి అర్జున్ (అంకిత్ కొయ్య‌) పుట్టి పెద్ద‌వాడయినా సుబ్ర‌మ‌ణ్యంకు ఉద్యోగం మాత్రం రాదు. ఇదిలా ఉండగా సుబ్రహ్మణ్యం కొడుకు అర్జున్ తను అల్లు అరవింద్ కొడుకని, అల్లు అర్జున్ తమ్ముడు అని కలలు కంటూ ఉంటాడు. తొలిచూపులోనే కాంచన(రమ్య)తో ప్రేమలో పడతాడు. ఇలా ఓ సంద‌ర్భంలో సుబ్ర‌మ‌ణ్యం అత్త‌గారు (అన్న‌పూర్ణ‌మ్మ‌) దాచిన డ‌బ్బును సొంతానికి వాడుకొని భార్య‌కు దొరికిపోతాడు. ఆ విష‌యంలో భ‌ర్త‌తో క‌ళారాణి గొడ‌వ‌ప‌డుతుంది. చ‌నిపోయిన త‌న త‌ల్లి అస్థిక‌ల‌ను పుణ్య‌న‌దుల్లో క‌ల‌ప‌డానికి తీర్థ‌యాత్ర‌ల‌కు వెళుతుంది క‌ళారాణి. ఆ సమయంలో ఒకరోజు అనుకోకుండా సుబ్రహ్మణ్యం అకౌంట్ లో 10 లక్షలు పడతాయి. దీంతో అవి ఎక్కడ్నుంచి వచ్చాయో తెలీక జుట్టు పీక్కుంటారు తండ్రి కొడుకులు. ఇక చేసేదేం లేక ఆ వచ్చిన రూ.10 ల‌క్ష‌ల డ‌బ్బుని తమ అవ‌స‌రాల కోసం తండ్రీ కొడుకులు ఇద్దరు ఖ‌ర్చు పెడుతారు. ఇక అవి ఖర్చు పెట్టేశాక ఏం జ‌రిగింది? ఇంత‌కీ ఆ డ‌బ్బు ఎవ‌రిది? అర్జున్‌, కాంచ‌న ఒక్క‌ట‌య్యారా? కళారాణి భర్త విషయంలో చివరికి ఏం చేసింది? ఇటువంటి తదితర విషయాలు తెలియాలంటే తెరపై  మారుతీన‌గ‌ర్‌ సుబ్రహ్మణ్యం సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే: 

రెండు భిన్నమైన అంశాలు తీసుకుని కుటుంబంలో ఉండే మధ్య తరగతి అవసరాలను, ఎమోషన్స్ ని చక్కగా చూపించాడు డైరెక్టర్. ఒకరకంగా చెప్పాలంటే మారుతి నగర్ సుబ్రమ‌ణ్యం ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. ఫ‌స్ట్ సీన్‌ నుంచి శుభం కార్డు వ‌ర‌కు నవ్విస్తూనే కథను చెప్పిన తీరు బాగుంది. ఏళ్ళ తరబడి కోర్టులో ఆగిపోయిన గవర్నమెంట్ జాబ్ కేసు, అనుకోకుండా అకౌంట్ లో డబ్బులు పడటం ఈ రెండు అంశాలతో సాగించినా కథనం ఆకట్టుకుంది. అకౌంట్‌లో డ‌బ్బుంద‌ని ఖ‌ర్చుపెట్టేసి ఆ త‌ర్వాత లేనిపోని ఇబ్బందులు ప‌డే మ‌ధ్య త‌ర‌గ‌తి మ‌న‌స్త‌త్వాలు, ఆ నేప‌థ్యంలోని భావోద్వేగాలు చాలామందికి క‌నెక్ట్ అయ్యే అంశాలు ఆలోచింపజేస్తాయి. ట్లే రావుర‌మేష్, అంకిత్ కొయ్య‌తో పాటు ప్ర‌తి క్యారెక్ట‌ర్ నుంచి ఫ‌న్ జ‌న‌రేట్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌.

పాతికేళ్లుగా ప్ర‌భుత్వ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న సుబ్ర‌హ్మ‌ణ్యం ఇంట్లో భార్య‌, అత్త చేత మాట‌లు ప‌డ‌టం, అత‌డి క‌ష్టాలు, కొడుకు భ్ర‌మ‌ల‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగిపోతుంది. అకౌంట్‌లో డ‌బ్బు ప‌డ్డాక ఒక్క‌సారిగా మారిపోయే వైనం, ఆ డబ్బు ఖ‌ర్చు పెట్టేశాక వ‌చ్చే క‌ష్టాల చుట్టూ ద్వితీయార్ధంలో కామెడీని మ‌లిచాడు ద‌ర్శ‌కుడు. అవన్నీ ప్రేక్ష‌కుడి ఊహ‌కు అందిన‌ప్ప‌టికీ, రావు ర‌మేష్ కామెడీ టైమింగ్, సినిమాని మ‌రో స్థాయికి తీసుకెళ‌తాయి..సినిమాలో అల్లు అర్జున్ రిఫరెన్సులు చాలానే ఉన్నాయి. బన్నీ ఫ్యాన్స్ కి ఈ సినిమా పండగే. ఇక హీరో హీరోయిన్ లవ్ ట్రాక్ ని కొత్తగా రాసుకున్నారు. వాళ్ళ మధ్య జరిగే సీన్స్ కూడా ఫుల్ ఫన్నీగా ఉన్నాయి. అలాగే క్లైమాక్స్ లో ఎవరూ ఊహించని అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చారు. ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ కార్య కథ, కథనాలతో ఆకట్టుకోవడంతో పాటు రావు రమేష్ వంటి సీనియర్ కి కథ చెప్పి, ఆడియన్స్ కు నచ్చేలా తీయడంతో సినిమా స్థాయిని పెంచారు. ఈ క్ర‌మంలో కొన్ని చోట్ల లాజిక‌ల్‌లు మిస్స‌యిన వాటిని కామెడీతో క‌వ‌ర్ చేశారు. ఎమోష‌న‌ల్ క్లైమాక్స్‌తో సినిమాను ఎండ్ చేసిన విధానం బాగుంది.

ఎవరెలా చేశారంటే::

సుబ్ర‌హ్మ‌ణ్యం త‌ప్ప రావుర‌మేష్ క‌నిపించ‌నంత‌గా ఈ పాత్ర‌లో ఒదిగిపోయాడు. సుబ్ర‌మ‌ణ్యం పాత్ర‌పై వంద శాతం ప్ర‌భావం చూపించారు రావు ర‌మేష్‌.కష్టపడే భార్య పాత్రలో ఇంద్రజ మెప్పించింది. అంకిత్ న‌ట‌నలోని హుషారు, అల్లు అర్జున్ రెఫ‌రెన్సుల‌తో ఆయ‌న్ని గుర్తు చేస్తూ, అల్లు అరవింద్ కొడుకునంటూ హంగామా చేస్తూ మంచి టైమింగ్‌తో న‌వ్వించాడు.బ‌బ్లీగ‌ర్ల్ పాత్ర‌లో ర‌మ్య ప‌సుపులేటి ఒకే అనిపించింది. హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్, నూకరాజు.. ఇలా మిగిలిన నటీనటులు కూడా బాగానే నవ్వించారు.

సాంకేతిక అంశాలు::

అన్ని విభాగాల కృషి ఈ సినిమాలో ఉన్నతంగా కనిపించింది. కొత్త కథ, కొత్త కథనంతో దర్శకుడు లక్ష్మణ్ కార్య ఈ సినిమాని పర్ఫెక్ట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి.