భద్రాచలం, వెలుగు: వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం భద్రాచలం గ్రామ పంచాయతీ ఆఫీసులోని నృసింహదాస మండపంలో రాపత్ సేవ జరిగింది. పంచాయతీ ఈవో శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది రామాలయానికి వెళ్లి స్వామివారిని ఊరేగింపుగా తీసుకొచ్చారు. అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు.
భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అంతకుముందు ఉదయం రామాలయంలో గాలిగోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం జరిగింది. తమలపాకులు, నిమ్మకాయలు, అప్పాల మాలలు నివేదించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది. కాగా అధ్యయనోత్సవాల్లోని రాపత్ సేవలు ముగిశాయి. బుధవారం నుంచి విలాసోత్సవాలు ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు ఉంటాయి.