ముంబై: ప్రముఖ నిర్మాత, టీ సిరీస్ సంస్థ ఎండీ భూషణ్ కుమార్‌పై రేప్ కేసు నమోదైంది. సినిమా చాన్సులు ఇప్పిస్తానని నమ్మించి తనను మోసం చేశాడంటూ 30 ఏళ్ల ఓ యువతి భూషణ్ మీద కేసు పెట్టింది. మూవీల్లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి 2017 నుంచి 2020 వరకు భూషణ్ కుమార్ తనపై పలుసార్లు అత్యాచారానికి పాల్పడ్డాడని ఆ నటి, మోడల్ పోలీసులకు కంప్లయింట్ చేసింది.
ఈ విషయాన్ని బహిర్గతం చేస్తే సంబంధిత వీడియోలు, ఫొటోలు విడుదల చేస్తానని బెదిరించాడని ఆరోపించింది. దీంతో భూషణ్‌పై 376 (అత్యాచారం), 420 (మోసం), 506 (బెదిరింపు) సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని డీఎన్ నగర్ పోలీసు స్టేషన్ సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మిలింద్ కుర్దే తెలిపారు. కాగా, భూషణ్ కుమార్‌పై ఇలాంటి ఆరోపణలు రావడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఓ గుర్తు తెలియని మహిళ తనను లైంగికంగా వేధిస్తున్నాడని భూషణ్ మీద కేసు పెట్టింది. తనతో సెక్స్‌కు ఒప్పుకుంటే మూడు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని భూషణ్ ఆఫర్ ఇచ్చాడని ఆ మహిళ కంప్లయింట్‌లో పేర్కొంది. అయితే ఆ ఆరోపణలను కుమార్ ఖండించడం గమనార్హం.