12 ఏళ్ల బాలికపై అత్యాచారం, జైలు శిక్ష.. కట్ చేస్తే ఒలింపిక్స్‌ క్రీడాకారుడిగా

12 ఏళ్ల బాలికపై అత్యాచారం, జైలు శిక్ష.. కట్ చేస్తే ఒలింపిక్స్‌ క్రీడాకారుడిగా

తెలిసీ తెలియని వయసులో ఓ మైనర్ బాలికపై నీచానికి ఒడిగట్టి.. జైలు శిక్ష అనుభవించాడు. అనంతరం ఒలింపిక్స్‌ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఓ డచ్ యువకుడి స్ఫూర్తిదాయక కథనమిది. అభం శుభం తెలియని ఓ బాలిక జీవితాన్ని అంధకారంలోకి నెట్టిన సదరు యువకుడి జీవితాన్ని మనం కీర్తించడం లేదు. తాను చేసిన తప్పును మరొకరు చేయకూడదని అతను కోరుకుంటున్నాడు. తనలా మరొకరు శిక్ష అనుభవించవద్దని వేడుకుంటున్నాడు. 

జూలై 26న ఫ్రెంచ్ రాజధాని పారిస్ వేదికగా ప్రారంభంకానున్న విశ్వక్రీడల్లో బీచ్ వాలీబాల్ పోటీలకు నెదర్లాండ్స్‌ జట్టు అర్హత సాధించింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరిలో ఒకరు.. స్టీవెన్ వాన్ డి వెల్డే కాగా, మరొకరు అతని భాగస్వామి మాథ్యూ ఇమ్మర్స్. వీరిలో అత్యాచారానికి ఒడిగట్టి జైలు శిక్ష అనుభవించిన యువకుడు.. స్టీవెన్ వాన్.

అది 2014.. అప్పుడు వాన్ వయస్సు.. 19 ఏళ్లు. ఆన్‌లైన్‌ ద్వారా బ్రిటన్‌కు చెందిన 12 ఏళ్ల ఓ బాలిక అతనికి పరిచయమైంది. ఆ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని డచ్ యువకుడు.. బాలికను కలవడానికి నెదర్లాండ్స్ నుండి యూకే(UK) వెళ్లాడు. కలవడానికి బాలిక కూడా అంగీకరించడంతో ఇద్దరు ఓ హోటల్‌లో కలిశారు. ఆ సమయంలో వాన్ శృతి తప్పాడు. బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై మైనర్ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. 2016లో బ్రిటన్‌ కోర్టు అతనికి నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. అనంతరం ఇరు దేశాల మధ్య ఒప్పందం ప్రకారం అతను నెదర్లాండ్స్‌కు బదిలీ చేయబడ్డాడు. డచ్ చట్టాల ప్రకారం శిక్ష అనుభవించాడు.

జైలు శిక్ష అనుభవించాక వాన్ ఆలోచనలే మారిపోయాయట. తాను చేసిన తప్పును తలుచుకొని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడట. ఆ మానసిక క్షోభ నుంచి బయట పడేందుకు అతను క్రీడల వైపు ద్రుష్టి మరల్చి.. ఒలింపిక్స్‌ క్రీడాకారుడిగా ఎదిగాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా తెలియజేశాడు. 

"నా జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు ఇది. అందుకు జీవితాంతం బాధను భరించవలసి ఉంటుంది. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్‌కు ముందు, ఇది అంతర్జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించగలదని నేను అర్థం చేసుకున్నాను.." అని వాన్ నెదర్లాండ్స్ వాలీబాల్ ఫెడరేషన్ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక వీడియోలో తెలిపాడు. చేసిన తప్పును అతను గర్వంగా చెప్పుకోవడం లేదు. పశ్చాత్తాప పడుతున్నాడు.