
కాన్బెర్రా: ప్రజల కోసం చట్టాలు చేసే పార్లమెంట్ లోనే దారుణం జరిగింది. డిఫెన్స్ మినిస్టర్ ఆఫీసులోనే ఉద్యోగిపై అత్యాచారం జరిగింది. ఆ మహిళతో పనిచేసే ఉద్యోగే ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆస్ట్రేలియాలో రెండేండ్ల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు వచ్చింది. అప్పట్లో తన ఉద్యోగం పోతుందని, కెరీర్ దెబ్బతింటుందని భయపడిన బాధితురాలు.. సోమవారం మీడియా ముందు తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పింది. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్ మోరిసన్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. బాధితురాలికి మంగళవారం క్షమాపణలు చెప్పారు. విచారణ జరిపించి, న్యాయం చేస్తానన్నారు. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని, తెలిపారు.
అసలేం జరిగిందంటే..
బ్రిటనీ హిగ్గిన్స్ పార్లమెంట్ మాజీ ఉద్యోగి. 2019 మార్చిలో ఒకరోజు ఈవెనింగ్ పార్టీ అయిపోయినంక ఆమె ఇంటికి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే ఆ టైమ్‌లో ఆమె కొలీగ్ వచ్చి.. డిఫెన్స్ మినిస్టర్ లిండా రెనాల్డ్స్ ఆఫీసులో పని ఉందని తీసుకెళ్లాడు. ఆయన అక్కడ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని హిగ్గిన్స్ ఆరోపించింది. దీనిపై అదే ఏడాది ఏప్రిల్‌లో పోలీసులకు కంప్లయింట్ చేశానని ఆమె చెప్పింది. అయితే కెరీర్ దెబ్బతింటుందనే భయంతో అధికారికంగా ఫిర్యాదు చేయలేదంది. సీనియర్ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని వాపోయింది. హిగ్గిన్స్ ఓరల్‌గా కంప్లయింట్ చేసిందని పోలీసులు కూడా కన్ఫామ్ చేశారు.
For More News..