గచ్చిబౌలి, వెలుగు : ప్రేమిస్తున్నాను.. పెండ్లి చేసుకుంటానని నమ్మించి ఓ యువతిపై యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఏపీ రాష్ట్రానికి చెందిన యువతి(22) ఉపాధి కోసం నగరానికి వచ్చి రాయదుర్గంలోని ఒకరి ఇంట్లో కేర్ టేకర్ గా పనిచేస్తోంది. ఇదే ప్రాంతానికి చెందిన వీరబాబు(24) ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. పెండ్లి చేసుకుంటానని నమ్మించాడు.
ఈ క్రమంలోనే కొన్ని రోజుల క్రితం క్రిష్ణానగర్ లోని ఓ ఓయో హోటల్‌కు తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తర్వాత పెండ్లికి ముఖం చాటేయడంతో బాధిత యువతి శుక్రవారం రాయదుర్గం పోలీసులను ఆశ్రయించింది. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు సంబంధిత పీస్‌కు బదిలీ చేస్తామని తెలిపారు.