
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం సాయంత్రం రాపిడ్ యాక్షన్ ఫోర్స్, స్థానిక ఏఆర్ బలగాలతో కలిసి ప్లాగ్ మార్చ్ నిర్వహించారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైన మార్చ్ స్టేషన్ రోడ్డు, డెయిలీ మార్కెట్, సుభాష్‌రోడ్డు, జేపీఎన్ చౌరస్తా, పాంచ్ చౌరస్తా, బడా మసీద్ రోడ్డు, పెద్దబజార్, రైల్వే కమాన్, నిజాంసాగర్‌చౌరస్తా, కొత్త బస్టాండు, అశోక్‌నగర్ కాలనీ రోడ్డు, పాత బస్టాండు, బతుకమ్మ కుంట మీదుగా సాగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ చైతన్యారెడ్డి మాట్లాడుతూ ఆర్ఎఫ్ జిల్లా భౌగోళిక పరిస్థితులు తెలుసుకునేందుకు ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నారన్నారు.
ఏదైనా శాంతి భద్రతల సమస్య తలెత్తినప్పుడు, మత ఘర్షణలు జరిగినప్పుడు రాపిడ్ యాక్షన్ ఫోర్స్ వచ్చి స్థానిక పోలీసులకు సాయం చేస్తారన్నారు. మేమున్నామని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ ప్లాగ్ మార్చ్ నిర్వహించామన్నారు. ఏఆర్ డీఎస్పీ యాకుబ్‌రెడ్డి, టౌన్ సీఐ చంద్రశేఖర్, ఆర్ఐలు సంతోశ్‌కుమార్, కృష్ణ , రాపిడ్ యాక్షన్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్ టీపీ బగేల్, ఇన్స్పెక్టర్లు హరిబాబు, మల్లేశ్వర్రావు, సిబ్బంది పాల్గొన్నారు.