- భద్రాచలం శివారులో వేగంగా డంపింగ్‌యార్డు నిర్మాణం
భద్రాచలం, వెలుగు : కాలుష్యం చెర నుంచి ఎట్టకేలకు గోదారమ్మకు విముక్తి లభించనుంది. పదేండ్ల నుంచి వేధిస్తున్న సమస్యకు అడ్డుకట్ట పడనుంది. భద్రాచలం పట్టణ శివారులోని మనుబోతుల చెరువు సమీపంలో 8 ఎకరాల స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మాణం వేగంగా సాగుతోంది. మరో 40 రోజుల్లో ఊళ్లోని చెత్తను డంప్ చేసేందుకు ఈ యార్డును అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో గోదావరి కరకట్టపై చెత్తను డంప్ చేసే ప్రక్రియ ముగియనుంది.
రూ.80లక్షలతో...
గ్రామపంచాయతీ నుంచి రూ.80 లక్షలతో ఎకరం స్థలంలో డీఆర్సీసీ (డ్రై వేస్ట్ రీసోర్స్ కలెక్టింగ్ సెంటర్)ను నిర్మిస్తున్నారు. రూ.45లక్షలతో వర్మీ కంపోస్టు, రూ.35లక్షలతో డీఆర్సీసీ షెడ్ల నిర్మాణం జరుగుతోంది. త్వరలో క్రషింగ్ మిషన్లను ఏర్పాటు చేయనున్నారు. ప్రస్తుతం భద్రాచలం టౌన్‌లోని 22 వార్డుల నుంచి 150 ఆటోల ద్వారా రోజూ 30 టన్నుల మేర పొడి, తడి చెత్త వస్తోంది. పొడి చెత్తను వేరు చేసి క్రష్ చేసే మిషన్‌ను ఐటీసీ పేపరు పరిశ్రమ రూ.70లక్షలు వెచ్చించి గ్రామపంచాయతీకి ఇస్తోంది. గ్రామపంచాయతీ మాత్రం తడి చెత్త కోసం క్రష్ మిషన్‌ను రూ.50లక్షలతో కొనుగోలు చేస్తోంది. షెడ్ల నిర్మాణం పూర్తి కాగానే ఈ రెండు మిషన్లను షెడ్లలో బిగించనున్నారు. చెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారీ, పేపర్లు, ప్లాస్టిక్‌లను వేరు చేయనున్నారు.
ఎన్నో గండాలు దాటి..!
2014లో రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం టౌన్ మాత్రమే మిగిలి చుట్టూ ఉన్న ప్రాంతమంతా ఆంధ్రాలో విలీనమైంది. నాడు భద్రాచలం టౌన్‌లోని చెత్తను ట్రాక్టర్ల ద్వారా ఏటపాక మండల కేంద్రంలోని పాల్‌రాజ్ ఇంజినీరింగ్ కాలేజీ వెనుక భాగంలో డంప్ చేసేవారు. అది ఆంధ్రాలో కలవడంతో డంపింగ్‌ను వారు అడ్డుకున్నారు. దీంతో నాటి నుంచి భద్రాచలంలో చెత్త డంపింగ్ పెద్ద సమస్యగా మారింది.
కూనవరం రోడ్డులో డంపింగ్ యార్డు కోసం ఎకరా 80 సెంట్లు కేటాయిస్తే రైతులు అడ్డుకున్నారు. బూర్గంపాడు మండలం సారపాకలోని మణుగూరు క్రాస్ రోడ్డు వద్ద కొంత స్థలం కేటాయిస్తే భద్రాచలం చెత్త తమకెందుకంటూ స్థానికులు తిరగబడ్డారు. భద్రాచలంలోనే మనుబోతుల చెరువు వద్ద స్థలం కేటాయిస్తే గిరిజనులు అభ్యంతరం తెలిపారు. ఇలా ఏండ్ల తరబడిఈ సమస్య పాలకులకు తలనొప్పిగా మారింది. ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. దీంతో చెత్తను గోదావరి కరకట్టపై డంప్ చేసి కాల్చుతున్నారు. ఈ పొగ రామాలయాన్ని చుట్టేస్తోంది. శ్వాసకోశ వ్యాధులతో స్థానిక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
ప్రతీక్ జైన్ రాకతో...
చివరకు ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టాక స్థానికులను ఒప్పించి డంపింగ్ యార్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా రూ.85లక్షలకు టెండర్ పొందిన కాంట్రాక్టర్నిర్మాణం చేపట్టకుండా సతాయించడంతో పంచాయతీ ద్వారానే పనులు ప్రారంభించారు. పంచాయతీరాజ్ ఏఈ, పంచాయతీ ఈవో శ్రీనివాసరావు నేతృత్వంలో డిపార్ట్మెంట్ ద్వారా పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎకరం స్థలంలో డంపింగ్‌యార్డు, మిగతా ఏడు ఎకరాల్లో అడవులను పెంచేలా యాక్షన్‌ప్లాన్ అమలు చేస్తున్నారు. పీవో ప్రతీక్‌జైన్ పనులను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.
త్వరలో అందుబాటులోకి..
మరో 40 రోజుల్లోనే డంపింగ్ యార్డు అందుబాటులోకి వస్తుంది. ఊళ్లోని చెత్తను ఇక్కడకు ఆటోలు, ట్రాక్టర్ల ద్వారా తీసుకొచ్చి డంప్ చేస్తాం. పొడి, తడి చెత్తలను వేరు చేస్తాం. వర్మీ కంపోస్టు తయారవుతుంది.
శ్రీనివాసరావు, ఈవో, గ్రామపంచాయతీ