సిటీ ఓటర్లకు ‘రాపిడో’ ఫ్రీ రైడ్

సిటీ ఓటర్లకు ‘రాపిడో’ ఫ్రీ రైడ్
  • పోలింగ్ సెంటర్ నుంచి ఇంటి వరకు డ్రాపింగ్

హైదరాబాద్, వెలుగు: సిటీ ఓటర్లకు ఫ్రీ సర్వీస్​అందించేందుకు ర్యాపిడో సంస్థ ముందుకొచ్చింది. ఓటు వేసిన తర్వాత ఉచితంగా పోలింగ్​స్టేషన్​వద్ద పిక్​చేసుకుని, ఇంటి వద్ద డ్రాప్ చేసేలా ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికల అధికారులతో ర్యాపిడో ఒప్పందం చేసుకుంది. దివ్యాంగులు, వృద్ధులను ఆటోలతోపాటు కార్లలో ఫ్రీగా డ్రాప్ చేయనుంది. తగిన సమాచారం ఇచ్చేందుకు ప్రతి పోలింగ్​సెంటర్​వద్ద ర్యాపిడో సంస్థ ప్రతినిధులు అందుబాటులో ఉండనున్నారు. బుకింగ్​విషయంలో ఏదైనా సందేహం ఉంటే, వారు సూచనలు చేస్తారు.

ర్యాపిడో మొబైల్ యాప్ ఈ ఫ్రీ డ్రాప్ సర్వీస్​పొందవచ్చు. యాప్ లోకి వెళ్లగానే పోలింగ్ కి సంబందించి ఫ్రీ కూపన్ తీసుకోవాల్సి ఉంది. ఆ కూపన్ ఆధారంగా ఫ్రీ డ్రాప్ సర్వీస్​పొందవచ్చు. సోమవారం ఎల్బీ స్టేడియంలో ర్యాపిడో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత బైక్ టాక్సీ రైడ్ల ర్యాలీలో ముఖ్య అతిథిగా రాష్ట్ర  ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ పాల్గొన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ జిల్లాలో ఓటింగ్ శాతం పెంచేందుకు మూడు నెలలుగా పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటింగ్ లో భాగస్వాములు కావాలని కోరారు. ఓటింగ్​శాతం పెంచేందుకు ర్యాపిడో సంస్థ ముందుకు రావడం అభినందనీయమని కమిషనర్​రోనాల్డ్​రోస్​అన్నారు. కార్యక్రమంలో వెటర్నరీ చీఫ్ అబ్దుల్ వకీల్, స్వీప్ అసిస్టెంట్ అధికారి నాగమణి, ర్యాపిడో బిజినెస్ హెడ్ రోహిత్ రాథోడ్  పాల్గొన్నారు.

పోస్టల్​ బ్యాలెట్ ఓటింగ్​ పరిశీలన

హైదరాబాద్/మెహిదీపట్నం:  గన్ ఫౌండ్రీ లోని ఆల్ సెయింట్స్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటేషన్  సెంటర్​ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సోమవారం సందర్శించారు. స్ట్రాంగ్ రూమ్, డేటా ఎంట్రీ, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ, రిజిస్టర్లను పరిశీలించారు. ఎంతమంది ఓటు వేశారో అడిగి తెలుసుకున్నారు. 8వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కొనసాగుతుందన్నారు. ఆదివారం వరకు హోమ్ ఓటింగ్ 50 శాతం కంటే ఎక్కువగా  పూర్తయిందని తెలిపారు. అలాగే మాసబ్ ట్యాంక్ ఫైన్, ఆర్ట్స్ యూనివర్సిటీలోని డీఆర్ సీని వికాస్ రాజ్ సందర్శించారు. ఆయన వెంట బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, సిటీ సీపీ కొత్తపేట శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.