భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో16 నెలల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన యువకుడికి 25 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ పోక్సో కేసుల మొదటి అదనపు సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. జిల్లాలోని దుమ్ముగూడెం మండలం తురుబాక గ్రామానికి చెందిన అజ్మీరా సాయి కిరణ్ (22) అనే యువకుడు జూన్ 24, 2018న 16 నెలల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పటి దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ ఈ కేసు నమోదు చేయగా, ఏఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్ విచారణ అధికారిగా ఉన్నారు. ఈ కేసులో చిన్నారి తల్లిదండ్రులతో సహా 12 మంది సాక్షులను విచారించారు. కాగా ఈ కేసులో కోర్టు నిందితుడు సాయికిరణ్ కు రూ.10వేల జరిమానా కూడా విధించింది. చెల్లించని పక్షంలో మరో ఆరు నెలలు అదనంగా జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని హెచ్చరించింది. పోక్సో చట్టం కింద 20 ఏళ్ల జైలుశిక్ష ఉన్నప్పటికీ, తెలంగాణలో 25 ఏళ్ల శిక్ష అరుదైనది. ఇతర రాష్ట్రాల్లోనూ పోక్సో చట్టం కింద 25 ఏళ్ల శిక్షలు చాలా తక్కువగా నమోదు కావడం గమనార్హం.