- ఆర్టిఫిషియల్ పల్మనరి వాల్‌ను అమర్చి ప్రాణం పోసిన డాక్టర్లు
- 35 ఎంఎం సైజ్ వాల్ తో చికిత్స దేశంలోనే మొదటిసారని వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ లో నిమ్స్ డాక్టర్లు అరుదైన గుండె చికిత్స చేశారు. పుట్టుకతో గుండె సమస్యతో బాధపడుతున్న ఓ యువకుడికి (20) ఎలాంటి ఆపరేషన్ లేకుండానే పల్మనరీ వాల్ స్థానంలో ఆర్టిఫిషియల్ వాల్ ను అమర్చి ప్రాణం పోశారు డాక్టర్లు. 32 ఎంఎం సైజ్ ఉన్న ఆర్టిఫిషియల్ వాల్ ను పల్మనరి వాల్ స్థానంలో అమర్చడం దేశంలోనే మొదటిసారి అని నిమ్స్ వైద్యులు తెలిపారు. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్ లో శనివారం కార్డియాలజీ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ డాక్టర్ సాయి సతీశ్ బృందంమీడియాకు వివరాలు వెల్లడించింది. సాయి సతీశ్ మాట్లాడుతూ మహబూబాబాద్ జిల్లా కురవి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన బానోత్ అశోక్ పుట్టుకతోనే టెట్రాలజీ ఆఫ్ ఫాలో (టీవోఎఫ్) అనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడని తెలిపారు. ‘‘ఐదేండ్ల వయసులో అతని తల్లిదండ్రులు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించారు. కొన్నాళ్లు బాగున్న అశోక్ మళ్లీ శ్వాస సంబంధిత సమస్యలు, గుండె వద్ద నొప్పిగా ఉండడం, బాడీ బ్లూ కలర్లోకి మారిపోవడం లాంటి సమస్యలతో ఇబ్బందిపడేవాడు.
పల్మనరీ వాల్ లీక్ అవుతున్నదని నిర్ధారించి, ఆ వాల్ స్థానంలో ట్రాన్స్ కేథిటర్ పద్ధతి ద్వారా మరో ఆర్టిఫిషియల్ వాల్‌ను అమర్చాం. వాస్తవానికి ఈ చికిత్సకు బయట రూ.30 లక్షలు అవుతుంది. అశోక్ కుటుంబ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని రూ.15 లక్షల్లోనే చికిత్స పూర్తిచేశాం. ఆ 15 లక్షల్లో రూ.10 లక్షలు సీఎంఆర్ఎఫ్ చెల్లించింది.
మిగతా రూ.5 లక్షలు అశోక్ కుటుంబం చెల్లించింది’’ అని సతీశ్ తెలిపారు. 35 ఎంఎం ఉన్న ఆర్టిఫిషియల్ వాల్‌ను అమర్చడం దేశంలోనే మొదటిసారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో డాక్టర్లు హేమంత్, శైలేష్ భాటియా, రాజశేఖర్, అమర్నాథ్, త్యాగు, అనస్థీషియా డాక్టర్ అద్నాన్ పాల్గొన్నారు.