
హైదరాబాద్ సిటీ, వెలుగు: వికారాబాద్ జిల్లా పూడూరు మండలంలోని కంకల్ గ్రామంలో మూడు కల్యాణీ చాళుక్యుల శాసనాలు దొరికాయని పురావస్తు పరిశోధకుడు, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సంపత్ కుమార్ సమాచారం మేరకు శివనాగిరెడ్డి ప్రాథమిక పరిశీలన చేశారు. ఆదివారం స్థానిక వీరభద్రాలయ ప్రాంగణంలో ఉన్న రెండు శిలాఫలకాలపై ఉన్న మూడుశాసనాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.
మొదటి శిలాఫలకంపై గల మొదటి శాసనంలో స్థానిక పాలకుడు బెజ్జరస తన పేరిట బెజ్జేశ్వరుడిని ప్రతిష్టించి 100 మర్తురుల (ఒక మర్తురు 8 ఎకరాలతో సమానం) భూమిని దానం చేసినట్లు ఉంది. రెండో శాసనంలో మహామండలేశ్వర సోవిదేవప్రగ్గడ, స్థానిక చౌదరి, కరణం పదవులను నిర్వహిస్తున్న బెజ్జరస, బెజ్జేశ్వరదేవర అంగరంగభోగాలకు 100 మర్తురుల భూమి, నగదును దానం చేసినట్లు ఉంది.
రెండో శిలాఫలకంపైగల మూడో శాసనంలో సోమపెర్మానడి, సౌధరి గుండరస, స్థానిక గావుండాలు, బెమ్మినాయకుడు, బిలనాయకుడు, నాభనాయకుడు, కంకల్ల-24 కంపణంలోని కంకల్ నకరానికి చెందిన ప్రముఖులు బెజ్జేశ్వరస్వామికి వివిధ దానాలు చేసినట్లు తెలిపే వివరాలు ఉన్నాయని శివనాగిరెడ్డి తెలిపారు.