
సోషల్ మీడియాలో అనేక ఫుడ్ వెరైటీ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. అందులో ఒకటి తాజాగా హంగామా చేస్తోంది. మామూలుగా ఇడ్లీ అంటే పప్పు నానబెట్టి, రుబ్బి.. దాన్ని ఉదయాన్నే కాస్త నీటితో కలిపి చేస్తాం. కానీ ఈ ఈ ఇడ్లీ మాత్రం కాస్త భిన్నంగా ఉంది. ఇందులో ప్రత్యేకతేంటంటే.. రసగుల్లాతో ఇడ్లీ చేయడం.
వినేందుకు కాస్త ఆశ్చర్యంగా అనిపించినా.. ఈ విచిత్రమైన వంటకానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుండడం విశేషం. @ritu_culinaryarts అనే ఇన్ స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన ఈ వీడియోలో ఇడ్లీ పిండిని గిన్నెల్లో వేసి.. అందులో రసగుల్లాలను పెట్టడం కనిపించింది. ఆ తర్వాత దీన్ని ఒక ఆవిరి పాత్రలో ఉంచడం చూడవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగిశాక ఫైనల్ గా రసగుల్లా ఇడ్లీ తయారు కావడం కూడా ఈ వీడియోలో గమనించవచ్చు.
ఇక ఈ వైరల్ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు. డిస్ లైక్ బటన్ కావాలంటూ కొందరు కామెంట్ చేస్తుండగా.. ఈ ఇడ్లీ అంతగా బాగాలేదంటూ మరికొందరు తమ భావాలను పంచుకున్నారు. ఇంతకుమునుపు అహ్మదాబాద్ విక్రేత కూడా ఇలాంటి వెరైటీ చాయ్ తో ముందుకు వచ్చారు. చాయ్ లో రసగుల్లాను ఉంచి దీన్ని తయారు చేశాడు.