ర్యాష్ డ్రైవింగ్ .. సిటీలో వాహనాలపై డేంజర్ గా వెళ్తున్న మైనర్లు

ర్యాష్ డ్రైవింగ్ ..  సిటీలో వాహనాలపై డేంజర్ గా వెళ్తున్న మైనర్లు

హైదరాబాద్, వెలుగు :   సిటీలో రోడ్లపై  మైనర్లు హద్దుమీరుతున్నారు. కార్లు, బైకులపై  స్పీడ్ గా వెళ్తున్నారు.   యాక్సిడెంట్లు చేస్తుండగా వారితో పాటు పలువురు మృత్యువాత పడుతున్నారు.  గత మే వరకు గ్రేటర్​సిటీలోని 3 కమిషనరేట్ల పరిధిలో 1,830 మైనర్​డ్రైవింగ్​కేసులు నమోదయ్యాయి. మైనర్ల డ్రైవింగ్ కట్టడికి పోలీసులు  కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయినా  ప్రతి ఏటా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మైనర్​డ్రైవింగ్​చేస్తూ పట్టుబడితే  పేరెంట్స్​ను కూడా బాధ్యుల్ని చేస్తూ చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఒకవేళ మైనర్​కు ఇతరులు కారు, బైక్​ఇస్తే.. సంబంధిత ఓనర్ పై కూడా కేసు నమోదు చేసి కోర్టులో దాఖలు చేస్తున్నారు. 

ఎంకరేజ్ చేస్తున్న పేరెంట్స్ 

ప్రధానంగా మైనర్ల డ్రైవింగ్ లో పేరెంట్స్ కూడా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. చిన్న వయసులో డ్రైవింగ్ నేర్పించడం ఫ్యాషన్ గా ఫీల్ అవుతున్నారు. 12 ఏండ్ల నుంచే తల్లిదండ్రులు పిల్లలకు స్కూటీ, బైక్ డ్రైవింగ్ నేర్పిస్తున్నారు. పేరెంట్స్​చాలామంది చిన్న చిన్న అవసరాలకు మైనర్లకు బైక్ లు ఇచ్చి బయటకు పంపుతున్నారు. మరికొందరు ఇంటర్ లో చేరగానే బుల్లెట్లు, స్పోర్ట్స్​ బైక్ లు కొనిస్తున్నారు. దీంతో మైనర్లు ఇష్టారీతిన రోడ్లపై స్పీడ్ గా వెళ్తూ యాక్సిడెంట్ల బారిన పడుతున్నారు. వారు ప్రమాదాలు చేయడమే కాకుండా ఇతరులను కూడా గాయపరుస్తున్నారు. వీకెండ్స్​లో రేసింగ్ ల పేరుతో రోడ్ల మీద ర్యాష్​ డ్రైవింగ్​చేస్తూ.. వాహనదారులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు. మైనర్లకు వెహికల్స్ ఇవ్వొద్దని పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా పేరెంట్స్​లో మార్పు రావడం లేదు. అయితే  మైనర్ల డ్రైవింగ్​ను కట్టడి చేసేందుకు పోలీసులు గల్లీలు, కాలనీల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

పేరెంట్స్ పైనా కేసులు పెడుతున్నం

మైనర్ల డ్రైవింగ్ పై  కఠినంగా వ్యవహరిస్తున్నం.  డ్రైవింగ్​ లైసెన్స్​, డ్రైవింగ్ కోసం ప్రత్యేకంగా తనిఖీలు చేస్తున్నం. మైనర్లు డ్రైవింగ్​చేస్తూ పట్టుబడితే.. పేరెంట్స్​పై కూడా కేసు నమోదు చేస్తున్నం. మైనర్​కు వెహికల్​ ఇచ్చిన వ్యక్తి, యజమానిపై కూడా కేసులు నమోదు చేసి కౌన్సిలింగ్​ఇస్తున్నం.   – హరిప్రసాద్​, 
ట్రాఫిక్​ ఏసీపీ, పంజాగుట్ట   

 3 కమిషనరేట్ల పరిధిలో  భారీగా కేసులు
 
మైనర్​డ్రైవింగ్ కేసుల్లో  రూల్స్ కఠినంగా​ఉన్నా కూడా ప్రతిఏటా కేసులు పెరుగుతున్నాయి. ఈ ఏడాది 3 కమిషనరేట్ల లో మే వరకు 1,830 మైనర్ డ్రైవింగ్​కేసులు నమోదయ్యాయి. ఒక్క హైదరాబాద్​కమిషనరేట్​ పరిధిలోనే1,150 , రాచకొండ కమిషనరేట్​లో 487 , సైబరాబాద్ కమిషనరేట్ లో 193 మైనర్​ డ్రైవింగ్​కేసులు నమోదయ్యాయి. పిల్లలపై పేరెంట్స్​పర్యవేక్షణ కూడా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. 

“గత మార్చిలో ఓ టెన్త్ స్టూడెంట్(15) వాకింగ్​కు వెళ్తున్నానని పేరెంట్స్​కు చెప్పి ఇంట్లోని స్కూటీ తీసుకుని తెల్లవారుజామున 5.30కే బయటకు వెళ్లాడు. బంజారాహిల్స్​నుంచి కేబీఆర్​పార్క్​వైపు స్పీడ్ గా వెళ్తూ  అక్కడి సిగ్నల్​వద్ద అదుపు తప్పి కరెంట్​స్థంభాన్ని ఢీకొట్టాడు.  దీంతో స్టూడెంట్​స్పాట్ లో చనిపోయాడు.’’  

“ గత ఏప్రిల్ లో ఓ బాలుడు ఇంట్లో చెప్పకుండా కారును తీసుకుని నలుగురు ఫ్రెండ్స్​తో కలిసి సరదాగా బయటకు వెళ్లారు. హయత్​నగర్​నుంచి సంఘీ టెంపుల్ వైపు వెళ్తుండగా కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. డ్రైవింగ్​చేస్తున్న 17 ఏండ్ల బాలుడితో పాటు ముందు సీట్లో కూర్చున్న 14  ఏండ్ల బాలుడికి తీవ్రగాయాలు అయ్యాయి. ఇద్దరూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.’’

“ ఇటీవల మణికొండలో ఓ ఆలయం వద్ద తెల్లవారుజామున ఓ మైనర్ బాలుడు​ స్పీడ్ గా కారును నడపడంతో అదుపు తప్పింది. దీంతో టెంపుల్​పార్కింగ్​ఏరియాలోని 20 బైక్​లు డ్యామేజ్ అయ్యాయి.  అక్కడ నిలబడిన ముగ్గురికి గాయాలు అయ్యాయి. నిందితుడైన బాలుడు పారిపోయేందుకు యత్నించగా స్థానికులు పట్టుకొని పోలీసులకు  అప్పగించారు.’’