ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్

ఆదిలాబాద్ రైతులకు రాశి సీడ్స్
  • తమిళనాడు నుంచి 30 వేల ప్యాకెట్లు తెప్పించిన సర్కార్ 
  • మరో 40 వేల ప్యాకెట్లకు ఆర్డర్
  • జిల్లాకు మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లు

హైదరాబాద్, వెలుగు : ఆదిలాబాద్ లో రాశి కాటన్ సీడ్స్ కు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో రైతులకు సరిపడా విత్తనాలు తెప్పించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేనప్పటికీ, ప్రత్యేకంగా రాశి సీడ్స్ ప్యాకెట్లకు ఆదిలాబాద్ జిల్లాలో డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి రాశి కాటన్ సీడ్స్ ను తెప్పించేందుకు వ్యవసాయ శాఖ​ఏర్పాట్లు చేసింది. శుక్రవారం 30 వేల ప్యాకెట్లను తమిళనాడు నుంచి తెప్పించి ఆదిలాబాద్​కు తరలించింది. 

నాలుగైదు రోజుల్లో మరో 40 వేల ప్యాకెట్లను అందుబాటులోకి తెస్తామని వ్యవసాయశాఖ డైరెక్టర్ గోపీ తెలిపారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి ఎక్కువగా సాగు చేస్తారు. ప్రతిఏటా 1.20 లక్షల ప్యాకెట్ల కాటన్ సీడ్స్ అవసరమవుతాయి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఏర్పాట్లు చేసి 80 వేల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచింది. అయితే కేవలం రాశి కాటన్ సీడ్స్ మాత్రమే కావాలంటూ రైతులు బారులుతీరారు. దీంతో మొత్తం 1.50 లక్షల ప్యాకెట్లను రైతులకు అందుబాటులో ఉంచేలా వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటికే 80 వేల ప్యాకెట్లు సిద్ధం చేయగా, ఇప్పుడు మరో 30 వేల ప్యాకెట్లను తమిళనాడు నుంచి తెప్పించింది. ఇంకో 40 వేల ప్యాకెట్లను కూడా తీసుకొస్తున్నది.  

ఒక్క జిల్లాలోనే డిమాండ్..  

రాశి సీడ్ కంపెనీ గతంలో మహబూబ్​నగర్​జిల్లా రైతులతోనే పత్తి సాగు చేయించి విత్తనాలు తయారు చేసేది. కానీ ఈసారి తమిళనాడులోని రైతులతో సాగు చేయించింది. దీంతో విత్తన తయారీ కూడా తమిళనాడులోనే చేపట్టింది. రాశి కాటన్ సీడ్స్ కు మిగతా జిల్లాల్లో అంతగా డిమాండ్ లేనప్పటికీ, ఒక్క ఆదిలాబాద్ జిల్లాలోనే డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు నుంచి రాశి కాటన్ సీడ్స్ తెప్పించి ఒక్క ఆదిలాబాద్ జిల్లాకే తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.