The Hundred: 600 వికెట్లు.. అరుదైన జాబితాలో ఆఫ్ఘన్ స్పిన్నర్

The Hundred: 600 వికెట్లు.. అరుదైన జాబితాలో ఆఫ్ఘన్ స్పిన్నర్

ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్.. స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ టీ20ల్లో సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ప్రపంచ టీ20 లీగ్ ల్లో అదరగొట్టే రషీద్.. తాజాగా టీ20 ఫార్మాట్ లో 600 వికెట్లు పడగొట్టి అరుదైన జాబితాలోకి చేరిపోయాడు. హండ్రెడ్‌ లీగ్‌ 2024లో భాగంగా రషీద్ ఖాన్ ఈ ఘనతను అందుకున్నాడు.  ట్రెంట్‌ రాకెట్స్‌కు ఆడుతున్న ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ సోమవారం (జులై 29) జరిగిన మ్యాచ్ లో ఒరిజినల్స్‌ బ్యాటర్‌ పాల్‌ వాల్టర్‌ వికెట్‌ ను పడగొట్టి 600 వికెట్ల క్లబ్ లో చేరాడు. తద్వారా టీ20 ఫార్మాట్ లో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. 

వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్‌ బ్రావో మాత్రమే టీ20ల్లో ఇప్పటివరకు 600 పైగా వికెట్లు తీశాడు. బ్రావో 578 మ్యాచ్‌ల్లో 630 వికెట్లు పడగొట్టగా.. రషీద్‌ ఖాన్ కేవలం 441 మ్యాచ్‌ల్లో 600 వికెట్ల ఘనత అందుకున్నాడు. 25 ఏళ్ళ రషీద్ ఖాన్ త్వరలో బ్రావో రికార్డ్ బద్దలు కొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. విండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్‌ నరైన్‌ (557), సౌతాఫ్రికా లెగ్ స్పిన్నర్ ఇమ్రాన్‌ తాహిర్‌ (502), బంగ్లాదేశ్ అల రౌండర్ షకీబ్‌ అల్‌ హసన్‌ (492), విండీస్ విధ్వంసక వీరుడు ఆండ్రీ రసెల్‌ (462) వరుసగా మూడు, నాలుగు, అయిదు, ఆరు స్థానాల్లో ఉన్నారు. 

ALSO READ : Hanuma Vihari: చంద్రబాబు రాకతో మనసు మారింది.. ఆంధ్రాతోనే హనుమ విహారి

ఈ మ్యాచ్ విషయానికి వస్తే అత్యంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఈ పోరులో ఒరిజినల్స్‌పై రాకెట్స్‌ పరుగు తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన రాకెట్స్‌ నిర్ణీత 100 బంతుల్లో 7 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. 45 పరుగులు చేసిన టామ్‌ బాంటన్‌ టాప్ స్కోరర్. లక్ష్య ఛేదనలో మాంచెస్టర్‌ 100 బంతుల్లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు మాత్రమే చేయగలిగింది.