IPL 2024: ఊపిరి పీల్చుకున్న గుజరాత్.. నెంబర్ వన్ బౌలర్ రీ ఎంట్రీ

IPL 2024: ఊపిరి పీల్చుకున్న గుజరాత్.. నెంబర్ వన్ బౌలర్ రీ ఎంట్రీ

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభం కాకముందే గుజరాత్ టైటాన్స్ కు భారీ ఎదురు దెబ్బలు తగిలిన సంగతి తెలిసిందే. కెప్టెన్ హార్దిక్ పాండ్య ముంబై ఇండియన్స్ జట్టుతో కలవగా.. అతని స్థానంలో యంగ్ స్టార్ గిల్ కు గుజరాత్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. స్టార్ పేసర్ మహమ్మద్ షమీ 2024 ఐపీఎల్ సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఇటీవలే ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ మాథ్యూ వేడ్ తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండటం లేదని కన్ఫర్మ్ అయింది. అయితే ఆ జట్టుకు తాజాగా ఒక శుభవార్త అందింది. 

వరల్డ్ బెస్ట్ స్పిన్నర్ రషీద్ ఖాన్ వెన్ను గాయం నుంచి కోలుకున్నాడు. చివరిసారిగా ఈ ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఆడాడు. గాయం నుంచి దాదాపు ఐదు నెలల పాటు క్రికెట్ కు దూరంగా ఉన్న రషీద్.. తాజాగా పోటీ క్రికెట్ ఆడేందుకు సిద్ధమయ్యాడని తెలుస్తుంది. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌తో సహా పలు T20 టోర్నమెంట్‌లకు రషీద్ దూరమయ్యాడు. గాయం నుండి పూర్తిగా కోలుకున్న ఈ లెగ్ స్పిన్నర్.. షార్జాలో మార్చి 15 నుండి ఐర్లాండ్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తన దేశం తరపున ఆడబోతున్నాడు.

Also Read : ఉత్కంఠ పోరులో ఆసీస్ విజయం.. కమ్మిన్స్‌పై టీమిండియా స్టార్ స్పిన్నర్ ప్రశంసలు

గాయం నుంచి కోలుకొని దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా ఆనందంగా ఉంది. మళ్లీ జాతీయ జెర్సీని ధరించి.. నా దేశం కోసం మంచి ప్రదర్శనను చేస్తాను. అని రషీద్ ఖాన్ పునరాగమనానికి ముందు ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ఎసిబి)తో చెప్పాడు. గతంలో సన్ రైజర్స్ జట్టు తరపున ఆడిన ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్.. 2022 లో గుజరాత్ జట్టులో చేరాడు. మార్చి 24న గుజరాత్ టైటాన్స్ తమ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది.