T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను వణికించిన రషీద్ ఖాన్.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్

T20 World Cup 2024: న్యూజిలాండ్‌ను వణికించిన రషీద్ ఖాన్.. వరల్డ్ కప్ చరిత్రలో ఆల్‌టైం రికార్డ్

వరల్డ్ కప్ లో రషీద్ ఖాన్ బౌలింగ్ లో తన దూకుడు చూపించాడు. ఐపీఎల్ లో అంచనాలు అందుకోలేకపోయినా.. వరల్డ్ కప్ తొలి మ్యాచ్ లోనే సత్తా చాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. శనివారం (జూన్ 8) ఉదయం 5 గంటలకు న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో రషీద్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 17 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు.కేన్ విలియమ్సన్ , మార్క్ చాప్మన్, బ్రేస్ వెల్, లాకీ ఫెర్గూసన్ వికెట్లను తీసుకున్న రషీద్ ఖాన్ వరల్డ్ కప్  చరిత్రలో ఒక ఆల్ టైం రికార్డ్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. 

టీ20 ప్రపంచకప్ చరిత్రలో కెప్టెన్‌గా అత్యుత్తమ గణాంకాలను (4/17) రషీద్ ఖాన్ నమోదు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డ్ మాజీ  న్యూజిలాండ్‌ కెప్టెన్ డేనియల్ వెట్టోరీ, ఒమన్‌ కెప్టెన్ జీషన్ మసూద్ పేరిట ఉంది. ఇద్దరూ కూడా సంయుక్తంగా 4/20 బౌలింగ్ స్పెల్ తో టాప్ లో ఉన్నారు. భారత్‌తో జరిగిన 2007 టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లో వెట్టోరి (4/20) ఈ ఘనత సాధిస్తే..జీషన్ 2021  వరల్డ్ కప్ లో పపువా న్యూ గినియాపై ఈ గణాంకాలను సాధించాడు.

ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు20 ఓవర్లలో 6 వికెట్లకు159 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్ 56 బంతుల్లో 80 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన కివీస్ జట్టును  15.2 ఓవర్లలో కేవలం 75 పరుగులకే పరిమితం చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 4, ఫారుఖీ 4, నబీ రెండు వికెట్లు తీశారు.