T20 World Cup 2024: లారా ఒక్కడే మమ్మల్ని నమ్మాడు.. విండీస్ దిగ్గజంపై రషీద్ ఖాన్ ప్రశంసలు

T20 World Cup 2024: లారా ఒక్కడే మమ్మల్ని నమ్మాడు.. విండీస్ దిగ్గజంపై రషీద్ ఖాన్ ప్రశంసలు

టీ20 వరల్డ్ కప్ 2024లో అండర్ డాగ్ గా బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్..సెమీ ఫైనల్ కు చేరుకుంది. భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే వరల్డ్ కప్ లో తృటిలో సెమీస్ ఆశలను చేజార్చుకున్న ఆఫ్ఘనిస్థాన్.. టీ20 వరల్డ్ కప్ లో తమ సెమీస్ కలను నెరవేర్చుకుంది. సూపర్-8 వరకే రావడం కష్టమనుకుంటే ఏకంగా సెమీస్ కు చేరి తామెంత ప్రమాదకరమో చెప్పారు. అయితే టోర్నీ ముందు వరకు ఆఫ్ఘన్ జట్టు మీద పెద్దగా ఎవరికీ నమ్మకాలు లేవు. సూపర్ 8 చేరుతుందని కూడా ఎవరూ అనుకోలేదు. అయితే వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కు చేరుతుందని జోస్యం చెప్పాడు.

ఆఫ్ఘనిస్తాన్ తో పాటు భారత్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లు ఈ మెగా ఈవెంట్ లో సెమీస్ చేరతాయని చెప్పుకొచ్చాడు. స్టార్ స్పోర్ట్స్ వారు నిర్వహించిన ఒక షో లో లారా తన ప్రిడిక్షన్ తెలిపాడు. లారా మినహాయిస్తే ఎవరూ కూడా ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరుతుందని చెప్పలేదు. ఈ విండీస్ దిగ్గజం చెప్పిన ప్రిడిక్షన్ లో వెస్టిండీస్ తప్ప మిగిలిన మూడు జట్లు సెమీస్ కు అర్హత సాధించాయి. దీంతో అతను చెప్పిన జోస్యం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఆఫ్ఘనిస్తాన్ కెప్టె రషీద్ ఖాన్ అయితే తమ జట్టుపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపాడు. మ్యాచ్ తర్వాత మాట్లాడుతూ ఈ విండీస్ దిగ్గజంపై ప్రశంసలు కురిపించాడు. 

"మమ్మల్ని సెమీఫైనల్‌కు చేర్చిన ఏకైక వ్యక్తి బ్రియాన్ లారా. అతను మాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టమని అనుకుంటున్నాం. ఈ టోర్నీకి ముందు లారాను కలిసి టీ20 వరల్డ్ కప్ గురించి చర్చించాను. నేను మిమ్మల్ని నిరాశపరచనని లారాకు చెప్పాను. అతను చెప్పింది నిరూపించినందుకు సంతోషంగా ఉంది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు సెమీస్ కు వెళ్లినందుకు చాలా గర్వంగా ఉంది". అని రషీద్ ఖాన్ లారాపై తనకున్న ప్రేమను తెలిపాడు.  

ఈ మ్యాచ్ విషయానికి వస్తే మంగళవారం (జూన్ 25) హోరీహోరీగా సాగిన చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో 8 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్ 17.5 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో గ్రూప్ 1 లో భారత్ తో పాటు ఆఫ్ఘనిస్తాన్ సెమీస్ కు చేరింది. దే గ్రూప్ లో భారత్ ఇప్పటికే సెమీస్ కు వెళ్లిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2లో ఇంగ్లాండ్, సౌతాఫ్రికా సెమీస్ కు చేరుకున్నాయి.