T20 World Cup 2024: ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకం వచ్చింది: రషీద్ ఖాన్

T20 World Cup 2024: ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకం వచ్చింది: రషీద్ ఖాన్

వరల్డ్ కప్ లో ఆఫ్ఘనిస్తాన్ జర్నీ ముగిసింది. అంచానాలు లేకుండా బరిలోకి దిగిన ఆ జట్టు.. సెమీస్ కు వెళ్లి సంచలనం సృష్టించింది. లీగ్ దశలో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లాంటి అగ్ర శ్రేణి జట్లను ఓడించి వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి సెమీ ఫైనల్ కు చేరుకుంది. అద్భుత ఆటతీరుతో సెమీస్ కు చేరుకున్న రషీద్ బృందం.. సౌతాఫ్రికా దెబ్బకు కుదేలైంది. గురువారం (జూన్ 27) ఏకపక్షంగా జరిగిన సెమీస్ లో సౌతాఫ్రికాపై 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. 

ఏ జట్టునైనా ఓడిస్తాం:  

ఈ మ్యాచ్ లో ఓడిపోయినా ఆఫ్ఘనిస్తాన్ సెమీ ఫైనల్ కు రావడం ఆ దేశ క్రికెట్ చరిత్రలో మర్చిపోలేని టోర్నీ. టోర్నీ అంతటా నిలకడగా రాణించిన ఆ జట్టును ఒక్క ఓటమితో తక్కువ చేయలేం. మ్యాచ్ అనంతరం కెప్టెన్ రషీద్ ఖాన్ జట్టు ఓటమిపై సానుకూలంగా  స్పందించాడు. ఇది మాకు ప్రారంభ దశ అని.. ఈ టోర్నీలో మా కాన్ఫిడెన్స్ పెరిగిందని రషీద్ ఖాన్ అన్నాడు. ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించగలమనే నమ్మకం కలిగిందని.. ఇది మాకు గొప్ప అనుభవం అని ఈ ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు. 

అద్భుతమైన జర్నీ ముగిసింది:               

గ్రూప్ దశలో న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని సాధించి టాప్ జట్లకు తమతో ప్రమాదమని సంకేతాలు పంపింది. వరల్డ్ కప్ లో గొప్ప రికార్డ్ ఉన్న కివీస్ ను ఓడించి సూపర్-8 కు చేరుకున్న ఆఫ్గన్లు.. ఇక్కడ కూడా తమ సత్తా చూపించారు. తొలి మ్యాచ్ భారత్ చేతిలో ఓడిపోయినా.. ఆ తర్వాత ప్రపంచంలోనే బలమైన ఆస్ట్రేలియా జట్టుకు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో ఆసీస్ పై 21 పరుగుల తేడాతో గెలిచి ఈ వరల్డ్ కప్ లోనే అతి పెద్ద సంచలనం నమోదు చేసింది.సెమీస్ లోకి అడుగుపెట్టాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

గురువారం (జూన్ 27) జరిగిన మొదటి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 11.5 ఓవర్లలో కేవలం 56 పరుగులకే ఆలౌటైంది. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా వికెట్  కోల్పోయి 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసి మ్యాచ్ గెలిచింది. మార్కో జాన్సెన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.