టీ20 క్రికెట్ లో ఆఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ కు ప్రత్యేక స్థానం ఉంది. ప్రపంచంలో ఎక్కడ క్రికెట్ లీగ్ జరిగినా ఈ ఆఫ్ఘన్ స్పిన్నర్ ను పోటీ పడి మరీ తీసుకుంటారు. దశాబ్ద కాలానికి పైగా టీ20 క్రికెట్ లో తనదైన మార్క్ చూపిస్తున్నాడు. ఇప్పటికీ రషీద్ స్పిన్ బ్యాటర్లకు ఒక సవాలే. తన స్పిన్ మాయాజాలంతో టీ20 క్రికెట్ లో ఎన్నో రికార్డులు తన పేరిట లిఖించుకున్న రషీద్ ఖాన్.. తాజాగా టీ20 క్రికెట్ లో చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మాట్ లో అత్యధిక వికెట్లు తీసుకొన్న బౌలర్ గా రికార్డులకెక్కాడు.
సౌతాఫ్రికా టీ20లో భాగంగా ముంబై కేప్ టౌన్, పార్ల్ రాయల్స్ మధ్య మంగళవారం(ఫిబ్రవరి 4) మధ్య మ్యాచ్ జరిగింది. క్వాలిఫయర్ 1 మ్యాచ్ లో భాగంగా రషీద్ ఖాన్ దునిత్ వెల్లలాగే వికెట్ తీసుకొని వెస్టిండీస్ లెజెండ్ డ్వేన్ బ్రావోను అధిగమించి ఈ ఘనతను అందుకున్నాడు. ఓవరాల్ గా టీ20 క్రికెట్ లో ఇప్పటివరకు రషీద్ ఖాన్ 461 టీ20 మ్యాచ్‌ల్లో 633 వికెట్లతో అగ్ర స్థానంలో ఉండగా.. 582 మ్యాచ్‌ల్లో బ్రావో 631 వికెట్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. 574 వికెట్లతో వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
Also Read :- రేపే ఇంగ్లాండ్, భారత్ వన్డే సిరీస్
దక్షిణాఫ్రికా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్(531), బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హసన్ (492) వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. బ్రాడ్‌కాస్టర్‌తో రషీద్ ఖాన్ మాట్లాడుతూ.. చాలా సంతోషంగా ఉంది. ఈ రికార్డ్ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు. 10 సంవత్సరాల ముందు ఈ ఘనత సాధిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అగ్రస్థానంలో ఉండడం గర్వంగా ఉంది. బ్రావో టీ20 క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్. అతని రికార్డ్ అధిగమించడం గౌరవంగా భావిస్తున్నాను". అని రషీద్ బ్రావో రికార్డ్ బ్రేక్ చేశాక తెలిపాడు.
అత్యధిక టీ20 వికెట్లు తీసిన బౌలర్లు:
రషీద్ ఖాన్: 633
డ్వేన్ బ్రేవో: 631
సునీల్ నరైన్: 574
ఇమ్రాన్ తాహిర్: 531
షకీబ్ అల్ హసన్: 492
A new T20 king is crowned 👑
— ESPNcricinfo (@ESPNcricinfo) February 5, 2025
Rashid Khan climbs past Dwayne Bravo, who had been the top T20 wicket-taker since April 2016 🤯 pic.twitter.com/8AcO33pBPi