అహ్మదాబాద్ వేదికగా జరిగిన భారత్-పాకిస్థాన్ వరల్డ్ కప్ మ్యాచులో పాక్ ఘోర పరాభవం మూట కట్టుకున్న సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్, ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో విఫలమై వరల్డ్ కప్ లో భారత్ పై తమ పరాజయాల సంఖ్యను పెంచుకున్నారు. కనీస పోరాటం చూపించకుండా చేతులెత్తేసిన విధానం పాక్ మాజీలకు ఏ మాత్రం నచ్చడం లేదు. అక్తర్, రమీజ్ రాజా, వసీమ్ అక్రమ్ లాంటి వారు పాక్ ఓటమిపై తమ అసంతృప్తి వ్యక్తం చేయగా.. తాజాగా మాజీ వికెట్ కీపర్ బాబర్, రిజ్వాన్ లను టార్గెట్ చేసాడు.
రషీద్ లతీఫ్ మాట్లాడుతూ " పాకిస్థాన్ లో ఒక్క బ్యాటర్ కూడా కుల్దీప్ యాదవ్ బౌలింగ్ ఆడలేకపోయారు. ముఖ్యంగా బాబర్ అజామ్, మహ్మద్ రిజ్వాన్ అతిగా స్వీప్ ఆడుతూ కనిపించారు. క్రికెట్ లో ధైర్యం లేనివారే ఇలా స్వీప్ షాట్లు ఆడతారు. ఈ క్రమంలో వీరు ఔటయ్యే ప్రమాదం నుండి తప్పించుకున్నారు. ఇద్దరు వ్యక్తిగత స్కోర్ కి ప్రాధాన్యమిచ్చారు గాని జట్టు ప్రయోజనాల కోసం ఆడలేదు. శ్రేయాస్ అయ్యర్, రోహిత్ శర్మ స్పిన్ ఆడే విధానాన్ని చూస్తే వీరిద్దరూ చాలా చక్కగా స్పిన్ ఎదుర్కొంటారు. మా వాళ్ళు పిరికివాళ్ళు. అందుకే బాగా ఆడలేకపోయారు" అని తమ ప్లేయర్స్ పై మండిపడ్డాడు.
ఇదిలా ఉండగా ఈ మ్యాచులో బాబర్ 50 పరుగులు చేయగా.. రిజ్వాన్ 49 పరుగులతో రాణించాడు. 2 వికెట్లకు 74 పరుగులు జట్టు ఉన్న దశలో 82 పరుగుల వీరి భాగస్వామ్యం పాక్ ని పటిష్ట స్థితిలోకి చేర్చింది. వీరిద్దరూ ఆచితూచి ఆడడంతో ఒకదశలో 30వ ఓవర్లో 2 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసి భారీ స్కోర్ దిశగా పరుగులు తీసింది. అయితే సిరాజ్ వీరిద్దరి భాగస్వామ్యానికి బ్రేక్ వేయడంతో పాక్ తమ చివరి 8 వికెట్లను 36 పరుగుల వ్యవధిలో కోల్పోయి 191 పరుగులకు ఆలౌటైంది.