రషీద్ ధమాకా
టైటాన్స్‌కు విక్టరీ అందించిన తెవాటియా, రషీద్
ఆఖరి బాల్‌కు హైదరాబాద్ బోల్తా
అభిషేక్, మార్‌క్రమ్, ఉమ్రాన్ మెరుపులు వృథా
ముంబై : కొత్త జట్టు గుజరాత్ టైటాన్స్ మరోసారి సూపర్ హిట్ అయ్యింది. అఫ్గాన్ స్పిన్ గన్ రషీద్ ఖాన్ (11 బాల్స్ లో 4 సిక్సర్లతో 31 నాటౌట్) బ్యాట్‌తో పేలిన వేళ మరో అద్భుతం చేసింది. ఆఖరి ఓవర్‌లో 22 రన్స్ అవసరమవగా.. తెవాటియా (21 బాల్స్ లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 40 నాటౌట్) ఒక సిక్స్, రషీద్ మూడు సిక్సర్లతో చెలరేగారు. దాంతో, బుధవారం జరిగిన మ్యాచ్‌లో టైటాన్స్ ఐదు వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఉత్కంఠ విజయం సాధించింది. లీగ్‌లో తమకు తొలి ఓటమి రుచి చూపించిన రైజర్స్‌ను దెబ్బకు దెబ్బ తీసింది. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ (42 బాల్స్ లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 65), మార్ క్రమ్ (40 బాల్స్ లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 56) దంచికొట్టినా.. బుల్లెట్లలాంటి బాల్స్‌తో ఉమ్రాన్ మాలిక్ మాలిక్ (5/25) ఈ సీజన్ లోనే బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చినా ఆఖరి ఓవర్లో సన్ రైజర్స్ డౌన్ అయ్యింది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 195/6 భారీ స్కోర్ సాధించింది. టైటాన్స్ బౌలర్లలో షమీ (3/39) మూడు వికెట్లతో రాణించాడు. ఛేజింగ్ లో వృద్ధిమాన్ సాహా (38 బాల్స్ లో 11 ఫోర్లు 1 సిక్స్ తో 68) మెరుపులకు తోడు తెవాటియా, రషీద్ హిట్టింగ్తో చివరి బాల్ వరకు ఆడిన టైటాన్స్ 199/5 స్కోర్ చేసి గెలుపొందింది. ఉమ్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
రైజర్స్ హిట్టింగ్
యంగ్‌స్టర్ అభిషేక్, మార్‌క్రమ్ ఫిఫ్టీలతో హైదరాబాద్ కు భారీ స్కోర్ అందించారు. కెప్టెన్ విలియమ్సన్ (5) తొందరగానే పెవిలియన్ చేరినా.. అభిషేక్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. వన్ డౌన్ లో వచ్చిన రాహుల్ త్రిపాఠి (16) షమీ ఓవర్లో 6,4,4తో సూపర్ షో చూపెట్టినా తర్వాతి బంతికే ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో మార్ క్రమ్, అభిషేక్ ఇన్నింగ్స్ ను ముందుకు నడిపారు. వీరిద్దరూ టైటాన్స్ బౌలర్లను దీటుగా ఎదుర్కోవడంతో 11.1ఓవర్లలోనే ఎస్ఆర్ హెచ్ స్కోర్ వంద దాటి రెండొందల వైపు దూసుకెళ్లింది. అయితే, 16 ఓవర్లో అభిషేక్ ను క్లీన్ బౌల్డ్ చేసిన జోసెఫ్ (1/35)మూడో వికెట్ కు 96 రన్స్ పార్ట్ నర్ షిప్ బ్రేక్ చేశాడు. తర్వాత వరుస ఓవర్లలో పూరన్ (3), మార్ క్రమ్, సుందర్ (3) ఔటయ్యారు. కానీ చివరి ఓవర్లో జాన్సెన్ (8 నాటౌట్) ఓ సిక్స్, శశాంక్ సింగ్ (25 నాటౌట్) హ్యాట్రిక్ సిక్సర్లతో ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
సాహా పునాది.. తెవాటియా, రషీద్ ముగింపు
భారీ టార్గెట్ ఛేజింగ్ లో ఓపెనర్లు సాహా, శుభ్ మన్ గిల్ (22) గుజరాత్ కు శుభారంభమిచ్చారు. రెండో ఓవర్లో 4,6తో వేగం పెంచిన సాహా బాదుడే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 8వ ఓవర్లో గిల్ ను ఉమ్రాన్ బౌల్డ్ చేయడంతో మొదటి వికెట్ కు 69 రన్స్ పార్ట్ నర్ షిప్ ముగిసింది. కాసేపటికే కెప్టెన్ హార్దిక్ (10)ను ఉమ్రాన్ పెవిలియన్ పంపాడు. పది ఓవర్లలో 91/2 తో నిలిచిన గుజరాత్ పటిష్ఠ స్థితిలోనే కనిపించింది. సాహా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొని మిల్లర్ (17) తో కలిసి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపాడు. అయితే మరోసారి బౌలింగ్ కు వచ్చిన ఉమ్రాన్ వరుస ఓవర్లలో సాహా, మిల్లర్, మనోహర్ (0)ను ఔట్ చేసి రైజర్స్ క్యాంప్ లో సంతోషాన్ని నింపాడు. ముఖ్యంగా153కేఎంపీహెచ్ సూపర్ యార్కర్ తో సాహాను క్లీన్ బౌల్డ్ చేయడం మ్యాచ్ కే హైలైట్. అప్పటికి టైటాన్స్ విక్టరీకి 24 బాల్స్ లో 56 రన్స్ అవసరం కాగా తెవాటియా, రషీద్ ఆ టార్గెట్ ను 12 బాల్స్ కు 35 రన్స్ గా కరిగించారు. ఇక నటరాజన్ వేసిన 19వ ఓవర్లో తెవాటియా 6,4 కొట్టగా చివరి 6 బాల్స్ లో 22 రన్స్ కావాల్సి వచ్చింది. ఆఖరి ఓవర్లో 25 సహా మార్కో జాన్సెన్ తన కోటాలో వికెట్ లేకుండా 63 రన్స్ ఇచ్చి రైజర్స్ పాలిట విలన్ అయ్యాడు.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 195/6 (అభిషేక్ 65, మార్ క్రమ్ 56, షమీ 3/39)
గుజరాత్: 20 ఓవర్లలో 199/5 (సాహా 68, తెవాటియా 40 నాటౌట్, ఉమ్రాన్ 5/25)