సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌‌‌‌గా రష్మిక

సైబర్ సేఫ్టీ అంబాసిడర్‌‌‌‌గా రష్మిక

న్యూఢిల్లీ: సైబర్ సేఫ్టీ ఇనీషియేటివ్స్‌‌‌‌కు నేషనల్ అంబాసిడర్‌‌‌‌గా నటి రష్మిక మందన్న నియమితులయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ) విభాగం ప్రకటించింది. ఆన్‌‌‌‌లైన్ మోసాలు, డీప్‌‌‌‌ఫేక్ వీడియోలు, సైబర్ బెదిరింపు, ఏఐతో  రూపొందించిన హానికరమైన కంటెంట్‌‌‌‌తో సహా వివిధ సైబర్ దాడుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా రష్మికను అంబాసిడర్‌‌‌‌గా అపాయింట్ చేసినట్లు వెల్లడించింది.

దేశవ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమాలను రష్మిక పర్యవేక్షించనున్నట్లు వివరించింది. అంబాసిడర్‌‌‌‌గా అపాయింట్ అయిన సందర్భంగా రష్మిక మందన్న మాట్లాడుతూ.." ప్రపంచంలోని ప్రముఖులతో పాటు వ్యాపారులకు, పలు సంఘాలకు, సామాన్యులకు సైబర్ క్రైమ్ ప్రమాదకరంగా మారింది. ఆ బాధ ఏంటో సైబర్ దాడికి గురైన వ్యక్తిగా నాకూ తెలుసు. ప్రజలకు అవగాహన పెంచడానికి,  సైబర్ క్రైమ్ కట్టడికి అంకితభావంతో పనిచేస్తాను.

సైబర్ బెదిరింపులను ఎదుర్కోవడానికి, మన డిజిటల్ స్పేస్‌‌‌‌లను కాపాడుకోవడానికి అందరం కలిసి పనిచేద్దాం. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ కు బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పడానికి సంతోషిస్తున్నా. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇది పనిచేస్తుంది. సైబర్ నేరస్తుల పట్ల మనం అలర్ట్​గా ఉండడమే కాదు.. వాళ్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలి" అని రష్మిక పేర్కొన్నారు.