
భద్రాచలం, వెలుగు: ఏప్రిల్ 6న మిథిలాస్టేడియంలో జరిగే శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా సీతారాముల కల్యాణంలో స్వామి, అమ్మవార్లకు రాష్ట్ర పద్మశాలి సంఘం అందించే చేనేత వస్త్రాల తయారీని బుధవారం ప్రారంభించారు. ఈవో రమాదేవి ఆధ్వర్యంలో పూజలు చేసి నేతను ప్రారంభించారు. అమ్మవారికి, రాముల వారికి వస్త్రాలను తయారు చేసి ఏటా ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. రంగనాయకుల గుట్టపై ఉన్న భక్తరామదాసు ధ్యానమందిరంలో ఈ కార్యక్రమం జరుగుతోంది.
ఖమ్మంకు చెందిన శ్రీ లక్ష్మీబాలాజీ భక్త బృందం గోటితో వలిచిన కోటి తలంబ్రాలను దేవస్థానానికి అప్పగించారు. శోభాయాత్రగా ఆలయానికి తలంబ్రాలను తీసుకొచ్చి స్థానాచార్యులు స్థలసాయి చేతుల మీదుగా అందజేశారు. ఉదయం సీతారామచంద్రస్వామికి ప్రాకార మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. బేడా మండపంలో నిత్య కల్యాణం జరిగింది.