
=8 మందిని రక్షించేందుకు ఆరుగురు మైనర్ల రెస్క్యూ
= ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాల ద్వారా టన్నెల్ స్థితిగతులపై అంచనా
హైదరాబాద్/నాగర్ కర్నూల్: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ లో చిక్కుకు పోయిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ర్యాట్ హోల్ మైనర్స్ ను రంగంలోకి దించింది. 2023లో ఉత్తరాఖండ్ సిల్కియారా సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుకోగా 17రోజులు ప్రయత్నించినా అధికారులు బయటికి తీసుకురాలేకపోయారు. చివరికి ఈ ర్యాట్ హోల్ మైనర్లు ఒక్కరోజులోనే వారందరినీ సురక్షితంగా తీసుకొచ్చారు.
ఎస్ఎల్ బీసీ వద్దకు చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. టన్నెల్‌లో పరిస్థితులను తెలుసుకునేందుకు ఎండోస్కోపిక్, రోబోటిక్ కెమెరాలను పంపి పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు.
ఏమిటీ ర్యాట్ హోల్ సిస్టం
ర్యాట్ హోల్ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైన విధానం. మేఘాలయ వంటి రాష్ట్రాల్లోని బొగ్గు నిక్షేపాలున్న ప్రాంతాల్లో ఎలుక బోరియలు చేసినట్లుగా రంధ్రాలు తవ్వి.. భూగర్భం నుంచి బొగ్గును వెలికి తీయడాన్ని ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. ఇది అత్యంత ప్రమాదకరమైనప్పటికీ జీవనోపాధి కోసం వందల మంది ర్యాట్ హోల్ మైనింగ్ చేస్తున్నారు. 2019లో సుప్రీంకోర్టు ర్యాట్ హోల్ మైనింగ్ అక్రమమని, సురక్షితం కాదని కూడా ప్రకటించింది.
ర్యాట్ హోల్ విధానం గురించి సింపుల్‌గా చెప్పాలంటే ఎలుకలు రంధ్రం చేసే విధంగా అన్నమాట. భూగర్భంలో లోతుకు ఇరుకైన గుంతలను తవ్వడాన్నే ర్యాట్ హోల్‌గా చెబుతుంటారు. నాలుగు అడుగుల వెడల్పుతో మాత్రమే ఉండే ఈ మార్గంలో ఒక్క మనిషి మాత్రమే పట్టేంత స్థలం ఉంటుంది.
ఈ విధానం ద్వారా భూమి పైనుంచి లేదా సమాంతరంగా సన్నని మార్గాన్ని లోతుకు ఏర్పాటు చేసుకొని.. గనుల్లో బొగ్గు పొరను చేరుకున్న తర్వాత దాన్ని బయటకు తీసేందుకు సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ప్రత్యేక పనిముట్లతో చేతుల ద్వారానే ఈ విధానంలో తవ్వకాలు చేపడతారు. రోప్‌లు, నిచ్చెనల సాయంతో కొద్ది కొద్దిగా తవ్వుకుంటూ లోపలికి చేరుకుంటారు.
ఇదీ తాజా పరిస్థితి
ఎస్ఎల్బీసీ టన్నెల్ లో చిక్కుకుపోయిన 8 మంది కార్మికులను బయటికి రప్పించేందుకు ప్రభుత్వం సైన్యాన్ని, డీఆర్ఎఫ్ ను రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. 13 కి.మీ దూరం వద్ద టన్నెల కూలిన విషయం తెలిసిందే. అక్కడ బురద, నీళ్లు ఉండటంతో రెస్క్యూ ఆపరేషన్ టీం ముందుకు వెళ్లడం కష్టతరంగా మారింది. రెస్క్యూ టీమ్స్ అతి కష్టంగా వంద మీటర్ల దూరం ముందుకు వెళ్లగలిగాయి.
రబ్బరు పైప్స్ ద్వారా బురదను తొలగించడంతోపాటు తొలగించిన ప్రాంతంలో చెక్కలను అమర్చుతూ ఆపరేషన్ నిర్వహిస్తున్నామని మంత్రి చెప్పారు. సొరంగం గోడలపై పగుళ్లు ఉన్నాయని, వాటి నుంచి నీరు లోనికి వస్తోందన్నారు.