గతంలో పలువురిని కరిచిన ఎలుకలు
బుధవారం ముగ్గురిని కరవడంతో స్థానిక హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్
హసన్‌పర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా హసన్‌పర్తిలోని తెలంగాణ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీ హాస్టల్ గదుల్లో ఎలుకల బెడదతో స్టూడెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్టూడెంట్లు పడుకున్న టైంలో ఎలుకలు దాడి చేసి గాయపరుస్తున్నాయి. ఎలుకల దాడిలో గతంలో కొందరు స్టూడెంట్లు గాయాలపాలు కాగా బుధవారం ముగ్గురిని ఎలుకలు కరవడంతో అస్వస్థతకు గురయ్యారు. వారిని హసన్‌పర్తి ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందించారు. హాస్టల్ గదుల్లో ఎలుకల బెడద ఎక్కువగా ఉందని ప్రిన్సిపాల్‌కు చెప్పినా పట్టించుకోవడం లేదని స్టూడెంట్లు ఆరోపించారు. విషయం తెలుసుకున్న స్టూడెంట్ల తల్లిదండ్రులు బుధవారం హాస్టల్‌కు చేరుకొని సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఎలుకలు కరిచిన విషయం బయట చెప్పొద్దని హస్టల్ సిబ్బంది స్టూడెంట్లను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు.