మనసున్న మారాజు

మనసున్న మారాజు

రతన్​ టాటా అంటే... ఒక బిజినెస్​మేన్​...  కోట్ల సామ్రాజ్యానికి అధిపతి... అంతేకాదు మానవతామూర్తిగా ఆయన ఎందరికో ఇష్టం. అంతెందుకు సోషల్​ మీడియాలో రతన్​ టాటాకు పెద్ద ఫ్యాన్​బేస్​ ఉంది. చేసే ప్రతీ పనిలో సొసైటీ పట్ల ఆయనకి ఉన్న బాధ్యత కనిపిస్తుంది. నానో ఆవిష్కరణ, తాజ్​ హోటల్​, సోషల్​ మీడియా... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ లిస్ట్​ చాలానే ఉంటుంది.

ఆమెకు పిల్లాడినే..

రతన్​ టాటాకు ఇన్​స్టా అకౌంట్​ ఫాలోయర్ల సంఖ్య మిలియన్​ దాటినప్పుడు ‘థ్యాంక్స్​’ చెప్తూ నేల మీద కూర్చుని నవ్వుతూ దిగిన ఫొటో ఒకటి పో స్ట్​ చేశారు. ఆ ఫొటోకి క్యాప్షన్​ ‘అనుకోకుండా దొరికిన అద్భుతమైన కుటుంబం’ అని రాశారు. ఆ పోస్ట్​కు ‘కంగ్రాట్యులేషన్స్​ ఛోటూ’ అని ఒక హార్ట్​ ఎమోజీ పెట్టి రెస్పాండ్​ అయ్యింది ఒక అమ్మాయి. అంతే... ‘అంత పెద్దాయనతో అమర్యాదగా కామెంట్​ చేస్తావా?’ అని విపరీతంగా ట్రోల్​ చేశారు ఆమెను. ఆ​ దెబ్బకు భయపడిన ఆమె కామెంట్​ డిలీట్​ చేసింది. ఈ విషయం కాస్తా టాటాకు తెలిసింది. వెంటనే ఆ అమ్మాయికి ప్రొటెక్షన్​గా స్వయంగా రంగంలోకి దిగారు పెద్దాయన. ఒక పెద్ద ఇన్​స్టా స్టోరీ షేర్​ చేశారు. అందులో ‘‘నిన్న ఒక అమాయకమైన అమ్మాయి తన మనోభావాలను హార్ట్​ఫుల్​గా చెప్తూ... నన్ను చిన్న పిల్లాడిగా చూసింది. ఆ కారణంగా ఆమెను మీరు వేధించడంతో  ఆ కామెంట్​ను డిలీట్​ చేసిందామె. అయితే ఆమె చేసిన కామెంట్​ను నేను గౌరవిస్తాను. అభినందిస్తాను. ఆమె భవిష్యత్తులో కూడా ఎటువంటి బెదురు లేకుండా పోస్టింగ్​లు చేయొచ్చు” అని చెప్పారు.

ఆన్​లైన్​లో పెరిగిన విద్వేష వ్యాప్తిపై ఇన్​స్టాలో పోస్ట్​ పెట్టి తన ఫాలోవర్లు బుల్లీయింగ్​కు పాల్పడొద్దని చెప్పారు. అలాగే ఇతరుల గురించి అనవసరంగా జడ్జిమెంట్లు ఇవ్వొద్దని యూత్​కు సజెస్ట్​ చేశారు కూడా.

మూగజీవాలంటే విపరీతమైన ప్రేమ

వీవీఐపీలు, సెలబ్రిటీలు రోజూ వచ్చివెళ్తుండే తాజ్​మహల్​ హోటల్​ ఎంట్రన్స్​ దగ్గర రోడ్డు మీద తిరిగే కుక్క ఒకటి పడుకుంది. ఎంట్రన్స్​లో అలా కుక్క పడుకుని ఉండడం ఆ హోటల్​ హెచ్​ ఆర్​ రూబీ ఖాన్​ చూసింది. అదే విషయాన్ని హోటల్​లో పనిచేస్తున్న ఉద్యోగులకు చెప్పింది. ‘‘ఆ కుక్క పుట్టినప్పటి నుంచీ ఇక్కడే పెరిగింది. హోటల్​లో అది ఒక భాగం. అదొక్కటే కాదు ఇక్కడికి వచ్చే ఏ మూగప్రాణిని అయినా జాగ్రత్తగా చూసుకోవాలనేది రతన్​ టాటా ఆర్డర్స్​” అని చెప్పారు. ‘‘ఎంతో బిజీగా ఉండే ఈ ప్లేస్​ని ఆ కుక్క తన సొంత ప్లేస్​ అనుకుంది’’ అని రూబీ ఖాన్​ లింక్డిన్​​లో రాసింది. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పుకోవాలి... టాటాల సామ్రాజ్య రాజధానిగా అనుకునే ‘బాంబే హౌస్’​లో వీధి కుక్కల కోసం ప్రత్యేకంగా గదులు కట్టించారు రతన్​ టాటా. 

ఎంప్లాయిస్​ కోసం...

తన దగ్గర పనిచేసి మానేసిన ఒక ఉద్యోగికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి ముంబయి నుంచి పూనేకు స్వయంగా వెళ్లి కలిశారు. ఆ విషయం మూడో కంటికి తెలియదు. కానీ ఆ విషయం లింక్డిన్​ పోస్ట్​ ద్వారా బయటకు వచ్చింది.ముంబయి ఉగ్రదాడి జరిగినప్పుడు తాజ్​మహల్​ హోటల్​ సిబ్బంది11 మంది ప్రాణాలు పోయాయి. 26/11 నాడు జరిగిన దాడిలో గాయపడిన, చనిపోయిన వాళ్ల కుటుంబాలను ఆయన కలిసి ‘‘మీ పిల్లల చదువుల బాధ్యతలను టాటా గ్రూప్​ చూసుకుంటుంది” అని భరోసా ఇచ్చారు. చనిపోయిన వాళ్లకి మిగిలిన జీవిత కాలంలో ఉద్యోగంలో ఎంత జీతం అయితే వస్తుందో... అంత జీతాన్ని ఆ  కుటుంబాలకు ఇచ్చారు. తాజ్​ పబ్లిక్​ సర్వీస్​ వెల్ఫేర్​ గ్రూపు ఒకదాన్ని ప్రారంభించారు. ఆ దాడి జరిగినప్పుడు అక్కడికి స్వయంగా వెళ్లి మరీ పరిస్థితులను తెలుసుకున్నారు.

క్రికెట్​ కోసం...

టాటా ట్రస్టు, టాటా సంస్థల నుంచి క్రికెటర్లకు పెద్ద ఎత్తున సాయం అందించారు రతన్​టాటా. క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చేందుకు తమ కంపెనీల్లో ఉద్యోగాలు ఇవ్వడంతో పాటు ఆర్థిక భరోసా కూడా కల్పించారు. అలనాటి క్రికెటర్లు ఫరూఖ్​ ఇంజినీర్​, మొహిందర్​ అమర్నాథ్​ ఆ జాబితాలో ఉన్నారు. బీసీసీఐ చీఫ్​ సెలక్టర్​ అజిత్​ అగార్కర్, భారత స్టార్​ మాజీ ఆల్​రౌండర్​ యువరాజ్​ సింగ్​, హర్భజన్ సింగ్​, రాబిన్​ ఉతప్ప, సంజయ్​ మంజ్రేకర్​, శ్రీనాథ్​, కైఫ్​కు టాటా గ్రూప్​లో ఉద్యోగాలు ఇచ్చారు. శార్దూల్​ ఠాకూర్​, జయంత్​ యాదవ్​లు కూడా టాటా గ్రూప్​ నుంచి సాయం అందుకున్నవాళ్లే. టాటాపవర్స్​, స్టీల్స్​, ఎయిర్​వేస్​ డిపార్ట్​మెంట్లలో క్రికెటర్లకు ఉద్యోగాలు ఇచ్చింది టాటా కంపెనీ. అంతేకాదు వాళ్లని స్పాన్సర్​ చేస్తూ వాళ్ల వెన్నంటే ఉంది కూడా.

స్టార్టప్​ల్లో పెట్టుబడులు

కొత్త ఇన్వెంట్​లను రతన్​ టాటా ఎప్పుడూ ఎంకరేజ్​ చేసేవారు. ఇండియాలో స్టార్టప్స్​ల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టారు. అలాంటి వాటిలో కొన్ని పేటీఎం, ఓలా, ఎలక్ట్రిక్​, అర్బన్​ వంటి కంపెనీలు.


టాటా స్టయిల్​ స్టేట్​మెంట్​ ఇది

రతన్​ టాటా వ్యక్తిత్వంలోని సింప్లిసిటీ ఆయన బట్టల్లో కూడా కనిపిస్తుంది. పెద్ద బిజినెస్​ టైకూన్​ అనగానే.. ఎలాంటి బట్టలు వేసుకోవాలి అని కథల్లో చెప్పినట్టో, సినిమాల్లో చూపించినట్టో ఊహించుకోవద్దు రతన్​ టాటా విషయంలో. చాలా సామాన్యంగా ఆలోచించాలి. ఆయన ఎప్పుడూ షర్ట్​, ట్రౌజర్స్​లోనే కనిపించేవారు. చిన్నప్పట్నించీ  అలానే ఉండేవారు. ఆ కాలం నాటి ఫొటోల్లో కూడా ప్లెయిన్​, క్యాజువల్​ టీ షర్ట్‌, ప్యాంట్స్​ వేసుకుని కనిపిస్తారు. జంషెడ్​పూర్​లోని టాటా స్టీల్​ ప్లాంట్​కి వెళ్లిన యంగ్​ రతన్​ టాటా బ్లాక్​ అండ్​ వైట్​ ఫొటోలో షర్ట్​, ట్రౌజర్స్​లో కనిపిస్తారు. ఆ డ్రెస్ స్టేట్​మెంట్​నే​ ఆయన జీవితకాలం మెయింటెయిన్​ చేశారు.
మీటింగ్స్​కి వెళ్లినప్పుడు మాత్రం సూట్స్​ వేసుకునేవారు. అప్పుడు కూడా ఆయన స్టయిల్​ స్టేట్​మెంట్​లో సింప్లిసిటీ కనిపించేది. డార్క్​ షేడ్స్​ సూట్స్​ను తెలుపురంగు షర్ట్​ తో జత చేసి వేసుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే ‘సింప్లిసిటీ అనేది స్ట్రాంగెస్ట్​ సూట్’​ ఆయనకు. ఒక్కోసారి చెక్స్​ షర్ట్​ను ప్లెయిన్​ ట్రౌజర్స్​తో మ్యాచ్​ చేసేవారు. ఎన్నో ట్రెండ్స్​, స్టయిల్స్​ వచ్చిపోతుంటాయి. కానీ రతన్​ టాటా మాత్రం తన ట్రూ స్టేట్​మెంట్ స్టయిలింగ్​కే కట్టుబడి ఉన్నారు.  

రతన్​ టాటా వేసుకునే బేసిక్​, కంఫర్టబుల్​ బట్టలు ఆయన్ని కామన్​ మ్యాన్​కి దగ్గర చేశాయి. సింప్లిసిటీ అనేది మనసు లోపలి నుంచి రావాలి. అదే టాటా స్టయిల్​ స్టేట్​మెంట్​కు అద్దం పట్టింది.

పార్సీ ఫుడ్​ ప్రేమికుడు

ఫిట్​నెస్​ మెయింటెనెన్స్​ గురించి టాటా చాలా పర్టిక్యులర్​గా ఉండేవారు. హెల్దీ డైట్​, పార్సీ ఫుడ్​ను ఇష్టపడేవాళ్లు. డిసిప్లీన్​ లైఫ్​ స్టయిల్​ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ఆయన పార్సీ కాబట్టి సింపుల్ పార్సీ డైట్​ ఇష్టపడేవారు. ఇంట్లో వండిన, తన అక్కచెల్లెళ్లు చేసిన సంప్రదాయ వంటకాలంటే చాలా ఇష్టం. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టే లేదా రెస్టారెంట్ ఫుడ్​ కంటే ఇంటి వంట ఆయన మెయిన్​ ఛాయిస్​. అలాగే మితంగా తినడం ముఖ్యం అంటారు. ఆ అలవాటే ఆయన్ని హెల్దీ ఫిజిక్​ మెయింటెయిన్​ చేసేలా చేసింది. ఆయన బిజీ కెరీర్​కు మంచి శక్తి అందించింది .

ఒక ఇంటర్వ్యూలో పార్సీ చెఫ్​ పర్వేజ్​ పటేల్​ మాట్లాడుతూ  ‘‘ఇంట్లో తయారుచేసిన పార్సీ వంటకాలను టాటా ఇష్టపడతారు. ఖట్టా, మీటా మసూర్​ దాల్​(పుల్లటి, తియ్యటి మసూర్​ దాల్​లో వెల్లుల్లి వేసి వండిన వంటకం), మటన్​ పులావ్​ దాల్​, నట్​ రిచ్​ బేక్డ్ కస్టర్డ్​ను ఇష్టంగా తింటారు. అకురి(స్ర్కాంబుల్డ్ ఎగ్స్ లాంటి) అనే పార్సీ వంటకాన్ని బ్రేక్​ఫాస్ట్​గా తింటారు” అని చెప్పారు. టాటా ఇండస్ట్రీతో పటేల్​కు దీర్ఘకాల అనుబంధం ఉంది. అంతేకాదు ఈయన టాటా ఫేవరెట్​ చెఫ్​ కూడా. 

టాటా తినే ఫుడ్​లో ఎక్కువ పోషకాలు, కార్బోహైడ్రేట్​, ప్రొటీన్​, హెల్దీ ఫ్యాట్స్​ తో పాటు, తక్కువ ప్రాసెస్డ్​ కాంపొనెంట్స్​ ఉంటాయి. ఎక్కువ కేలరీలు ఉండవు. ఆయన మీల్స్​లో గింజధాన్యాలతో తయారుచేసే అన్నం, రోటీలతో పాటు అధిక ప్రొటీన్​ కలిగిన కాయధాన్యాలు (లెంటిల్స్​, పల్సెస్​), తాజా పండ్లు, కూరగాయలు రెగ్యులర్​గా ఉండేవి. పుష్కలంగా విటమిన్స్‌, మినరల్స్ అందించే ఆకు కూరలు, సీజనల్​ వెజిటబుల్స్​, సలాడ్స్​ తినేవారు. 


తెలుగు రాష్ట్రాలతో..

హైదరాబాద్​లో ‘ఇండియన్​ బిజినెస్​ స్కూల్’ 1999 డిసెంబర్​ 20న ప్రారంభమైంది. బోర్డు ప్రారంభ డైరెక్టర్లలో రతన్​ టాటా ఒకరు. 2006లో ఏప్రిల్​ 8న జరిగిన గ్రాడ్యుయేషన్​ డేకు ఆయన ముఖ్య అతిథిగా వచ్చారు.

హైదరాబాద్​లో 1998లో మొదలైన ట్రిపుల్​ఐటీకి 2006 నుంచి రతన్​ టాటా ఆర్థిక సాయం చేశారు. సంస్థలో భాగంగా ‘కోహ్లి సెంటర్​ ఆన్​ ఇంటెలిజెంట్​ సిస్టమ్స్’​ను 2015లో ప్రారంభిస్తే దానికి టాటాలు సాయం అందించారు.

2010లో ఆదిభట్లలో టాటా అడ్వాన్స్​డ్​ సిస్టమ్స్​ లిమిటెడ్​ ద్వారా ఏర్పాటైన మొదటి సికోర్​స్కీ ఎస్​–92, 2014 సెప్టెంబర్​ 27న హైదరాబాద్​ ఇంటర్నేషనల్​  ఎయిర్​పోర్ట్​ క్యాంపస్​లో ఏర్పాటుచేసిన ‘కెనడా స్కూలిచ్​ స్కూల్​ ఆఫ్​ బిజినెస్​’ ను అప్పటి సీఎం కేసీఆర్​తో కలిసి ప్రారంభించారు. ఇది మొదట 50 ఎకరాల్లో ప్రారంభమైంది. తర్వాత దాన్ని విస్తరించారు. ప్రస్తుతం 250 ఎకరాల్లో పరిశ్రమలు నడుపుతున్నారు. దీనివల్ల డైరెక్ట్​గా ఎనిమిది వేల మందికి ఉపాధి దొరికింది.

తెలంగాణ అకాడమీ ఆఫ్​ స్కిల్​ నాలెడ్జ్​ సెంటర్​(టాస్క్​) ద్వారా ట్రైనింగ్‌, ఉపాధి కల్పన కార్యక్రమంలో టాటా అడ్వాన్స్​డ్​ సిస్టమ్స్​ లిమిటెడ్​ భాగస్వామి.

2024 మార్చి 17న పీవీ నరసింహారావు స్మారక ట్రస్ట్​ రతన్​ టాటాకు పీవీ స్మారక పురస్కారం అందచేసింది. ఇవేకాకుండా టాటా మోటార్స్​ ద్వారా వెహికల్స్​ సేల్స్​, తనిష్క్​ బంగారు ఆభరణాలు, క్రోమా హౌస్​హోల్డ్​ షాపులను టాటా సంస్థ నిర్వహిస్తోంది. వీటి ద్వారా మన రాష్ట్రంలో 60 వేల మందికి పైగా ఉపాధి పొందుతున్నారు.

టీసీఎస్​ క్యాంపస్​

హైదరాబాద్​లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్​(టీసీఎస్​) గ్లోబల్​ డెవలప్​మెంట్​ సెంటర్​ (దక్కన్​ పార్క్​) 2003లో నవంబర్​ 7న మొదలైంది. టీసీఎస్​ క్యాంపస్​ ద్వారా 90 వేల మందికి ఉపాధి దొరికింది.టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సోషల్ సైన్సెస్​ టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ సోషల్​ సైన్సెస్​ క్యాంపస్​ 2012లో హైదరాబాద్​లో ప్రారంభమైంది.  సౌతిండియాలో ఇదే మొదటి క్యాంపస్​.

ఫండమెంటల్​ రీసెర్చ్​

2010 అక్టోబర్​ 19న హైదరాబాద్​ యూనివర్సిటీ దగ్గర 209 ఎకరాల్లో టాటా ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ ఫండమెంటల్​ రీసెర్చ్​ కొత్త క్యాంపస్​కు శంకుస్థాపన జరిగింది. 2017 నుంచి నడుస్తోంది.

పుట్టపర్తి, తిరుపతి​తో అనుబంధం

రతన్‌‌‌‌ టాటా ఆంధ్రప్రదేశ్​లోని పుట్టపర్తిలో ‘విద్యావాహిణి’ ప్రాజెక్టుకు సహకారం అందించారు. సత్యసాయి ఆధ్యాత్మిక బోధనలు, సేవలకు ఆకర్షితుడైన రతన్‌‌‌‌టాటా మొదటిసారి 2009 డిసెంబరు 3న ప్రశాంతి నిలయానికి వెళ్లారు. 2010 నవంబరు 23న సత్యసాయి తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా శ్రీసత్యసాయి విద్యావాహిణి ప్రాజెక్టున ప్రారంభించారు. మొదటి విడతలో తొమ్మిది లక్షల మందికి విద్య అందించేందుకు  రతన్‌‌‌‌టాటా ముందుకొచ్చారు.

ఆన్​లైన్​ సర్వీసులు

నిత్యం కోట్లాది మంది భక్తులు వెళ్లే తిరుమల తిరుపతిలో శ్రీవారి సేవలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాంకేతిక సాయంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ బోర్డుతో కలిసి సర్వీసులు ఇచ్చారు రతన్​ టాటా. అదెలాగంటే...  శ్రీవారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌ సేవలు అందించడంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌‌‌‌ (టీసీఎస్‌‌‌‌)ది కీలకపాత్ర. టీటీడీకి ఉచితంగా సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సర్వీస్​లను అందించే ఒప్పందాన్ని మైలురాయిగా చెప్తారు. టీటీడీకి అవసరమైన సాఫ్ట్‌‌‌‌వేర్‌‌‌‌ సర్వీస్​లు, ఉద్యోగులను టీసీఎస్‌‌‌‌ ఇచ్చింది.

ఆన్‌‌‌‌లైన్‌‌‌‌, కరెంట్‌‌‌‌ బుకింగ్‌‌‌‌లో టికెట్ల జారీ, గదుల కేటాయింపు, నగదు చెల్లింపులు వంటి సర్వీసులను ఎనిమిదేళ్లుగా టీసీఎస్​ అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.12 కోట్ల విలువ చేసే సర్వీస్​లను టీసీఎస్‌‌‌‌ ఇస్తోంది. 2018లో నిజపాద దర్శన సేవలో శ్రీవారిని రతన్‌‌‌‌టాటా దర్శించుకున్నప్పుడు ఆయనతోపాటు టాటా గ్రూప్‌‌‌‌ ఛైర్మన్‌‌‌‌ ఎన్‌‌‌‌.చంద్రశేఖరన్‌‌‌‌ కూడా ఉన్నారు.

క్యాన్సర్​ కోసం..

ప్రాణాంతకమైన క్యాన్సర్‌‌‌‌ నుంచి పేద ప్రజలను కాపాడేందుకు అధునాతన వైద్య సేవలను టాటా ట్రస్టు తిరుపతిలో అందుబాటులోకి తెచ్చింది. పాతిక ఎకరాల స్థలంలో రూ.250 కోట్ల వ్యయంతో ‘శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌ కేర్‌‌‌‌ అండ్‌‌‌‌ అడ్వాన్స్‌‌‌‌డ్‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌ సెంటర్‌‌‌‌ (స్వీకార్​)’ను ఏర్పాటు చేసింది. రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు టాటా క్యాన్సర్‌‌‌‌ ఆస్పత్రి చాలా ఉపయోగకరంగా ఉంది. ఇదే కాకుండా టాటా ట్రస్ట్​ దేశంలో ఐదుచోట్ల రూ.1800 కోట్ల ఖర్చుతో క్యాన్సర్‌‌‌‌ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టింది.

శ్రీసిటీ...

రెడీ-టు-ఈట్‌‌‌‌(ఆర్టీఈ) మార్కెట్‌‌‌‌లో దేశంలో రెండో అతిపెద్ద సంస్థగా పేరున్న టాటా స్మార్ట్‌‌‌‌ ఫుడ్‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌(టీఎస్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎల్‌‌‌‌) పరిశ్రమను శ్రీసిటీలో చేశారు రతన్​ టాటా. శ్రీసిటీలోని ‘క్రియా విశ్వవిద్యాలయం’ పాలక మండలికి సలహాదారుగా ఉన్న రతన్ టాటా 2019 ఏప్రిల్‌‌‌‌16న శ్రీసిటీ చూసేందుకు వచ్చారు.

ఐపీఎల్​ స్పాన్సర్

​ప్రపంచంలోనే అతి పెద్ద లీగ్​ ఐపీఎల్​కు స్పాన్సర్​షిప్​ చేస్తోంది టాటా. వివోతో బీసీసీఐ వివాదం నేపథ్యంలో స్పాన్సర్​గా ఎవరొస్తారని చూస్తున్నప్పుడు టాటా ముందుకొచ్చింది. టైటిల్​ స్పాన్సర్​గా నాలుగేండ్ల కాలానికి 2,500 కోట్ల రూపాయలతో డీల్​ చేసుకుంది. ఐపీఎల్​ చరిత్రలో ఇదే అత్యధికం. మహిళల ప్రీమియర్​లీగ్​ను కూడా టాటానే స్పాన్సర్​ చేస్తోంది. అంతకుముందు కూడా1996లో టైటాన్​ కప్​, 2000లో మ్యాచ్​ ఫిక్సింగ్​ టైంలో భారత జట్టుకు క్లిష్టపరిస్థితులు ఎదురైనప్పుడు కూడా టాటా గ్రూప్​ అండగా నిలిచింది.

సామాన్యులతో కలిసి...

మామూలుగా అయితే బిజినెస్​ టైకూన్స్​ కార్లో జర్నీ చేసేటప్పుడు వెనక సీట్లో కూర్చుంటారు. కానీ రతన్​ టాటా మాత్రం డ్రైవర్​ పక్కన కూర్చొని ఆ జర్నీని ఎంజాయ్​ చేసేవాళ్లు. విమానాల్లో ఎక్కువగా ఎకానమీ క్లాస్​లోనే జర్నీ చేసేవారు. ఎయిరిండియా సీనియర్​ పైలట్​ కెప్టెన్​ జోయా అగర్వాల్​ ఎక్స్​పీరియెన్స్​ గురించి ఇక్కడ చెప్పుకోవాలి. ‘‘న్యూయార్క్​ నుంచి ఢిల్లీకి వస్తున్న విమానంలో ఒకసారి రతన్​జీ ప్రయాణించారు. అది నాజీవితాన్ని మార్చేసింది. జర్నీ పూర్తయ్యాక ఆయనతో ఒక ఫొటో తీసుకుంటానని అడిగాను. ఫొటో కోసం నేను నిల్చుంటుంటే ‘‘కెప్టెన్​ ఇది మీ సింహాసనం. ఇది మీరు సంపాదించుకున్నది” అని చెప్పి నా వెనక్కి వెళ్లారు రతన్​జీ. ఆ రోజున ఆయన స్పందించిన తీరు నా మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది” అని జోయా ఎక్స్​లో పోస్ట్​ చేశారు. ఆ ఫొటో షేర్​ చేశారు. కెప్టెన్ జోయా బోయింగ్​ 777 విమానానికి సీనియర్​ పైలట్​. చిన్న వయసులో బోయింగ్​ విమానం నడిపిన ఘనత ఆమె సొంతం. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మార్గం (నార్త్​ పోల్​) మీదుగా ఏకధాటిగా విమానం నడిపినందుకు ‘శాన్​ఫ్రాన్సిస్కో ఏవియేషన్​ మ్యూజియం లైబ్రరీ’లో జోయాకి చోటు దక్కింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలు ఆమె.