- టాటాను ప్రపంచపటంలో నిలబెట్టిన దిగ్గజం
- సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ దాకా ఎన్నో వ్యాపారాలు
న్యూఢిల్లీ: రతన్ టాటా భారత పారిశ్రామికరంగంపై చెరగని ముద్ర వేశారు. టాటా సామ్రాజ్యాన్ని ఖండాంతరాలకు వ్యాపింపజేశారు. ఉప్పు నుంచి మొదలు విమానాల వరకు ఎన్నో వ్యాపారాలను అద్భుతంగా నడిపించారు. ఆయన కృషి వల్ల ప్రతి భారతీయుడి జీవితం సౌకర్యవంతంగా మారిందని చెప్పవచ్చు. ఆధునిక భారతదేశ నిర్మాతల్లో రతన్ టాటా ఒకరు. భారతీయులపై ఆయన చూపిన ప్రభావం విస్మరించలేనిది. ఆయన ప్రస్థానం విశిష్టమైనది. రతన్ టాటా కేవలం వ్యాపారంలో నాయకుడిగా మాత్రమే మిగిలిపోలేదు. అభాగ్యులను ఆదుకోవడానికి విశేష కృషి చేశారు. సమాజంలో సానుకూల మార్పులు తేవడానికి చేతనైనంత చేశారు. ఆయన హయాంలో టాటా సామ్రాజ్యం ఎలా విస్తరించిందో చూద్దాం..
1981: టాటా ఇండస్ట్రీస్ చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు తీసుకున్నారు. ఎన్నో ఆలోచనలకు పదును పెట్టారు. మరెన్నో కొత్త ప్రొడక్టులను, సేవలను అందుబాటులోకి తెచ్చారు. వ్యాపారాన్ని పెద్ద ఎత్తున విస్తరించారు.
1983: ఆయన టాటా ఉప్పును ప్రారంభించారు. ఇది భారతదేశపు మొట్టమొదటి జాతీయ బ్రాండెడ్ ఉప్పు. గృహావసరాల మార్కెట్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఇది భారతదేశంలో అతిపెద్ద ప్యాకేజ్డ్ ఉప్పు బ్రాండ్‌గా ఎదిగింది.
1986: రతన్ టాటా ఎయిర్ ఇండియా చైర్మన్‌గా నియమితుడయ్యారు. 1989 వరకు సేవలు అందించారు.
1991: టాటా సన్స్ టాటా ట్రస్ట్‌ల చైర్మన్‌గా రతన్ టాటా బాధ్యతలు స్వీకరించారు. భారతదేశ ఆర్థిక సరళీకరణకు సంబంధించిన కీలక సమయంలో ఆయన టాటా గ్రూప్‌ను పునర్నిర్మించడం ప్రారంభించారు. అదే సంవత్సరం టాటా మోటార్స్, (అప్పుడు టెల్కో) ప్యాసింజర్ వాహనాల మార్కెట్లోకి ప్రవేశించింది.
1994: రతన్ టాటా నాయకత్వంలోనే నగల బ్రాండ్ తనిష్క్ ఏర్పాటయింది. నాణ్యతకు, నమ్మకానికి పర్యాయపదంగా మారింది. బ్రాండ్ హాల్‌మార్కింగ్, ఎథికల్ సోర్సింగ్‌పై దృష్టి సారించింది.
1998: టాటా మోటార్స్ టాటా ఇండికాను విడుదల చేసింది. దీనిని పూర్తిగా మనదేశంలోనే డిజైన్ చేసి తయారు చేశారు. కంపెనీ భారతదేశపు మొట్టమొదటి ఎస్యూవీ అయిన టాటా సఫారీని కూడా రతన్ టాటా మార్గదర్శకత్వంలో ప్రవేశపెట్టారు
2000: టాటా టీ (ఇప్పుడు టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్) యూకే -ఆధారిత టెట్లీ టీని 450 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఇది బ్రిటిష్ బ్రాండ్‌ను స్వాధీనం చేసుకున్న మొదటి భారతీయ కంపెనీగా చరిత్రలో నిలిచింది.
2003: ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్‌ను) ఏర్పాటు చేశారు. స్టాక్ ఎక్స్ఛేంజీలలోనూ లిస్ట్‌చేశారు. దీని విలువ ఇప్పుడు 183.36 బిలియన్ డాలర్లు. ఇది భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీగా అవతరించింది.
2006: రతన్ టాటా టాటా స్కైని ప్రారంభించడం ద్వారా డైరెక్ట్- టు- హోమ్ (డీటీహెచ్) టెలివిజన్ మార్కెట్‌లోకి ప్రవేశించారు. ఇది అప్పటి నుంచి ఈ రంగంలో అగ్రగామిగా మారింది.
2008: లక్షలాది మందికి సురక్షితమైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో టాటా మోటార్స్ టాటా నానోను ఆవిష్కరించింది. బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ జేఎల్ఆర్ను కూడా కొన్నది.
ఆకాశమంత మనసు
రతన్ టాటా బిలియన్ డాలర్లు సంపాదించినా, కనీసం బిలియనీర్ కూడా కాలేదు. ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో సింహభాగం సమాజం కోసమే ఖర్చు చేశారు. చేతికి ఎముక లేదన్నట్టుగా దానాలు చేశారు. తన జీవితకాలంలో అనేక దాతృత్వ కార్యక్రమాలకు నిధులు సమకూర్చారు. ఈ కార్యక్రమాలు వివిధ ప్రాంతాలలోని అనేక మంది ప్రజల జీవితాలను మార్చాయి. రతన్ టాటా విద్యను ప్రోత్సహించడానికి ఎల్లప్పుడూ ముందుండేవారు. ఆయన అనేక విద్యా సంస్థలకు నిధులు సమకూర్చారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలోని పిల్లలకు విద్యను అందించడానికి ఆయన ప్రత్యేక శ్రద్ధ చూపించారు.
ఆరోగ్యం అనేది అభివృద్ధికి పునాది అని నమ్మే రతన్ టాటా , ఆరోగ్య రంగంలో కూడా అనేక కార్యక్రమాలను చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆసుపత్రుల అభివృద్ధికి, వైద్య సదుపాయాలను మెరుగుపరచడానికి నిధులు సమకూర్చారు. గిరిజనుల అభివృద్ధి, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక సామాజిక సమస్యల పరిష్కారానికి ఆయన తన వంతు సహాయాన్ని అందించారు. కళలు, సంస్కృతిని ప్రోత్సహించడానికి కూడా అనేక కార్యక్రమాలను చేపట్టారు.
మిత్రమా ‘లైట్‌హౌస్’.. ఇక సెలవు
రతన్ టాటా పర్సనల్ అసిస్టెంట్ స్నేహితుడు శంతను నాయుడు ఆయన మరణంపై భావోద్వేగంతో స్పందించారు. రతన్‌ను ఆయన ‘లైట్‌హౌస్’ అని ఆప్యాయంగా పిలిచేవారు. నాయుడు గురువారం తన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో టాటాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్‌పెట్టారు. “ఈ స్నేహం ఇప్పుడు నాకు మిగిల్చిన అగాథం. దీనిని నేను నా జీవితాంతం పూరించడానికి ప్రయత్నిస్తాను.
దుఃఖం ప్రేమకు చెల్లించాల్సిన ధర. వీడ్కోలు, నా ప్రియమైన లైట్‌హౌస్”అని రాశారు. టాటా కంపెనీల్లో అతి పిన్న వయస్కుడైన జనరల్ మేనేజర్ అయిన నాయుడుకి, రతన్ టాటాకు మధ్య ప్రత్యేకమైన బంధం ఉంది. ఇద్దరికీ జంతువుల పట్ల ప్రేమే ఇందుకు కారణం. రాత్రి సమయంలో జరిగే ప్రమాదాల నుంచి వీధికుక్కలను రక్షించడానికి నాయుడు రిఫ్లెక్టివ్ కాలర్లను రూపొందించడంతో టాటా ఆయనను అభినందించారు. వీళ్లిద్దరు 2014లో మొదటిసారి కలుసుకున్నారు. రోడ్డుపై ఉన్న కుక్కలను రక్షించడానికి నాయుడు చేసిన ప్రయత్నాన్ని ఇష్టపడి తన బృందంలో రతన్ టాటా చేర్చుకున్నారు.
రతన్ టాటా వారసుడు ఎవరు ?
రతన్ టాటా మరణించడంతో ఆయన వారసుడిపై చర్చ మొదలయింది. దూరదృష్టి, దృక్పథంతో టాటా కంపెనీలను సమన్వయంతో నడిపించడం రతన్ టాటా వారసుడి ముందున్న పెద్ద సవాలు.రతన్ టాటా సవతి సోదరుడు నోయెల్ టాటా ఈ పదవి కోసం పోటీలో ఉండే అవకాశం ఉంది. ఆయన ఇప్పటికే అనేక గ్రూప్ కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. ప్రస్తుతం ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ వంటి సంస్థల బాధ్యతలు చూస్తున్నారు. మెహ్లీ మిస్త్రీ కూడా పోటీ పడుతున్నారు.