మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా చేసిన కృషికి గానూ.. మహారాష్ట్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి విశ్వవిద్యాలయం పేరును రతన్ టాటా మహారాష్ట్ర స్టేట్ స్కిల్స్ డెవలప్‌మెంట్ యూనివర్సిటీగా మార్చనున్నట్లు ప్రకటించింది.
ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం ఇండస్ట్రీయల్ అవార్డులను రతన్ టాటా పేరుతో ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.. అంతేగాకుండా రతన్ టాటాకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రతిపాదిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. వృద్ధాప్య సంబంధమైన అనారోగ్యంతో అక్టోబర్ 9న రాత్రి ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో రతన్ టాటా తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే..
సంపాదన, లాభాల్లో 60% దానధర్మాలకే..
మధ్య తరగతి ప్రజల కలలను సాకారం చేయడానికి రతన్ టాటా 2015లో నానో కారును తీసుకొచ్చారు. రూ. లక్షకే దీనిని అందుబాటులోకి తెచ్చారు. ప్రపంచవ్యాప్తంగా టాటా నానో సామాన్యుల కారుగా పేరుగాంచింది. కాగా, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్‌ను స్థాపించి తన కంపెనీల ద్వారా వచ్చిన లాభాలలో 60 నుంచి 65 శాతం దాతృత్వ ప్రయోజనాల కోసం రతన్ టాటా విరాళంగా అందించారు. రతన్ టాటాను కేంద్రం పద్మ విభూషణ్, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశవిదేశాల్లోని ప్రముఖ యూనివర్సిటీలు ఆయనను గౌరవ డాక్టరేట్లతో గౌరవించాయి.
Maharashtra Government has decided to rename the Maharashtra State Skills Development University as “Ratan Tata Maharashtra State Skills Development University”
— ANI (@ANI) October 14, 2024