వీ మిస్ యూ లెజెండ్: అశ్రునయనాల నడుమ ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

వీ మిస్ యూ లెజెండ్: అశ్రునయనాల నడుమ ముగిసిన రతన్ టాటా అంత్యక్రియలు

భారత వ్యాపార రంగంలో ఓ శకం ముగిసింది. ప్రముఖ పారిశ్రామిత్త వేత, మానవతావాది రతన్ టాటా అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, వివిధ రంగాల ప్రముఖులు, వేలాది మంది అభిమానుల అశ్రునయనాల నడుమ ముగిశాయి. ఎన్సీపీఏ స్టేడియం నుండి ముంబైలోని వర్లీ స్మశానవాటిక వరకు రతన్ టాటా అంతిమయాత్ర సాగింది. అధికారిక లాంఛనాలతో  వర్లీ స్మశానవాటికలో రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి అనంతరం టాటా పార్థివ దేహానికి గౌరవ వందనం చేసి ఘన నివాళులు అర్పించారు. 

దేశవ్యాపారం రంగంలోనే తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రతన్ టాటాకు కడసారి వీడ్కోలు పలికేందుకు ఎన్పీసీఏ గ్రౌండ్ నుండి వర్లీ స్మశానవాటిక వరకు జరిగిన అంతిమయాత్రలో పెద్ద ఎత్తున సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు పాల్గొన్నారు. రతన్ టాటా అంత్యక్రియలకు కేంద్ర ప్రభుత్వం తరుఫున కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే, ఉద్ధవ్ థాక్రే, ముఖేష్ అంబానీ, నీతా అంబానీ తదితరులు రతన్ టాటా దహన సంస్కార కార్యక్రమంలో పాల్గొన్నారు. 

కాగా, వృద్ధాప్య, ఇతర అనారోగ్య కారణాలతో ఇవాళ (2024, అక్టోబర్ 10) రతన్ టాటా అస్తమించిన విషయం తెలిసిందే. ముంబైలోని ప్రముఖ బ్రీచ్ క్యాండి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ టాటా తుదిశ్వాస విడిచారు. తన తెలివితేటలతో టాటా ఇండస్ట్రీ సామాజ్రాన్ని కింది స్థాయి నుండి విదేశాలకు విస్తరించిన రతన్ టాటా.. పేదలకు సహయం చేయడంలోనూ అంతే దాతృత్వం చూపించి గొప్ప మానవతావాదిగా పేరుగాంచారు. 

ALSO READ : ‘రెస్ట్ ఇన్ పీస్ టాటాజీ’.. రతన్ మరణంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సంతాపం

రతన్ టాటా మరణ వార్త యావత్ భారతావనీ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ఓ గొప్ప వ్యక్తిని కోల్పోయామంటూ దేశ ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్నారు. టాటా చేసిన విశేష కృషిగానూ మహారాష్ట్ర ప్రభుత్వం ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు రతన్ టాటా అంత్యక్రియలను అధికారిక లాంఛనాల నడుమ నిర్వహించారు.