
- మూడు రోజులుగా క్యూ కడుతున్న జనం
- ఇదే అదనుగా దోచుకుంటున్న సెంటర్ల నిర్వాహకులు
- ఒక్కో అప్లికేషన్‌కు రూ.100 నుంచి 800 వరకు వసూలు
- ఫిర్యాదు చేయాలంటున్న ఆఫీసర్లు
- దరఖాస్తుకు చివరి తేదీ అంటూ ఏదీ లేదని ప్రకటన
హైదరాబాద్ సిటీ, వెలుగు : రేషన్ కార్డ్ దరఖాస్తుల పేరిట నగరంలోని ‘మీసేవ’ సెంటర్లు జనాలను దోచుకుంటున్నాయి. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రూ. 50గా నిర్ణయించగా, ఒక్కో సెంటర్లో రూ.100 నుంచి మొదలుకుంటే రూ.800 వరకు తీసుకుంటున్నారు. పదేండ్ల పాలనలో బీఆర్ఎస్ప్రభుత్వం ఒక్క కొత్త రేషన్‌కార్డు కూడా ఇవ్వకపోవడంతో కాంగ్రెస్సర్కారు రాగానే కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. తాజాగా మీ సేవల్లో అప్లయ్చేసుకోవాలని చెప్పడంతో మూడు రోజులుగా సెంటర్లకు జనాలు క్యూ కడుతున్నారు.
అన్ని సెంటర్లు రద్దీగా కనిపిస్తున్నాయి. ఏ సెంటర్ముందు చూసినా 200 మందికి పైగా కనిపిస్తున్నారు. ఉదయం 8 గంటలకే వచ్చి లైన్లు కడుతున్నారు. 9 గంటలకు సెంటర్ ఓపెన్ చేస్తుండడంతో ఒక్కొక్కరు మినిమం గంట నుంచి 5 గంటల వరకూ వేచి చూడాల్సి వస్తున్నది. రాష్ట్రమంతటా రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు తీసుకుంటుండడంతో అక్కడక్కడా సర్వర్లు డౌన్ అవుతోంది.
దీంతో ప్రాసెస్నెమ్మదిగా కొనసాగుతోంది. జనం తాకిడిని కొందరు మీ సేవ సెంటర్ల నిర్వాహకులు క్యాష్చేసుకుంటున్నారు. ప్రభుత్వ ఆధీనంలోని మీ సేవ సెంటర్లలో రేషన్ కార్డ్ దరఖాస్తుకు రూ.50 తీసుకుంటుండగా, ప్రైవేట్సెంటర్లలో ఇష్టారీతిన వసూలు చేస్తున్నారు.
60 శాతం కొత్త దరఖాస్తులే..
రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారిలో 50 నుంచి 60 శాతం మంది ఇదివరకు అప్లై చేసుకున్నవారే ఉంటున్నారని, మిగతా 40 శాతం మందిలో పేర్లు డిలీట్చేసుకునేవారు, యాడ్చేసుకునేవారు ఉంటున్నారని మీ సేవా కేంద్రాల నిర్వాహకులు చెప్తున్నారు. ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారు కూడా ఎందుకైనా మంచిదని మళ్లీ దరఖాస్తు పెట్టుకుంటున్నారని అంటున్నారు.
ఇతరులకు తప్పని తిప్పలు
మీ సేవా కేంద్రాలకు వందల సంఖ్యలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకునేవారే వస్తుండడంతో బర్త్ , క్యాస్ట్, ఇన్ కమ్ తదితర సర్టిఫికెట్ల కోసం వచ్చేవారికి ఇబ్బందులు తప్పడం లేదు. కొన్ని చోట్ల 300కు మించి వస్తుండడంతో కంట్రోల్‌చేయడం తమ వల్ల కావడం లేదని కొందరు నిర్వాహకులు చెప్తున్నారు. టెంపరరీగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ALSO READ : కోర్ అర్బన్ ఏరియా మొత్తం డ్రోన్ సర్వే చేయండి : సీఎం రేవంత్ రెడ్డి
చివరి తేదీ అంటూ లేదు..
కొత్త రేషన్ కార్డుల కోసం ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని, దీనికి చివరి తేదీ అంటూ ఏదీ లేదని ప్రభుత్వం ఎన్నో సార్లు ప్రకటించింది. ఈ విషయం తెలియని జనాలు మీ సేవా సెంటర్లకు క్యూ కడుతూ ఇబ్బందులు పడుతున్నారు. దరఖాస్తుల స్వీకరణ నిరంతరం కొనసాగుతుందని, ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకోని వారు మాత్రమే అప్లై చేసుకోవాలని సివిల్సప్లయీస్అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఫోన్ చేయండి.. లైసెన్స్ రద్దు చేస్తాం
రేషన్ కార్డు అప్లికేషన్ కోసం మీ-సేవ నిర్వాహకులు రూ.50 మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, జనం అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న కొంతమంది నిర్వాహకులు అంతకుమించి తీసుకుంటున్నారని అధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో వారిపై 1100 నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు. ఇప్పటివరకు మూడు రోజుల్లో పది వరకు ఫిర్యాదులు వచ్చాయని, వారికి షోకాజ్‌నోటీసులు ఇచ్చామని అంటున్నారు. విచారణ జరిపి లైసెన్స్ రద్దు చేస్తామని తెలిపారు. అలాగే, టెక్నికల్ ఇష్యూస్రాకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.