18వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్‌‌‌‌ .. కొత్తగా మరో 20 వేలు వచ్చే చాన్స్​

  • ఐదేండ్లుగా రేషన్​కార్డుల కోసం ఎదురుచూపులు
  • 2018లో 34వేల అప్లికేషన్లు రాగా 15వేలు శాంక్షన్​

కరీంనగర్, వెలుగు: జిల్లాలో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డు అప్లికేషన్లకు మోక్షం కలగనుంది. గురువారం నుంచి ప్రజాపాలన గ్రామసభల్లో ఐదు గ్యారంటీలకు అప్లికేషన్లు తీసుకోనున్నారు. వీటితోపాటు రేషన్​కార్డుల కోసం అప్లికేషన్లు స్వీకరిస్తామని, రానున్న రోజుల్లో వాటిని పరిశీలించి అర్హులకు శాంక్షన్​ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2018లో అప్పటి సర్కార్​ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసుకునేందుకు అవకాశమిచ్చింది.  అప్పట్లో 34,293 దరఖాస్తులు రాగా, 15,114 రేషన్ కార్డులు మాత్రమే మంజూరయ్యాయి. 831 దరఖాస్తులను రిజెక్ట్ చేయగా, మరో 18,348 పెండింగ్‌‌‌‌లో ఉన్నాయి.  వీరంతా ఐదేళ్లుగా రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. 

తప్పని ఎదురుచూపులు.. 

జిల్లాలో పెళ్లయి ఐదారేండ్లయినా అర్హులైన కొత్త జంటలకు రేషన్ కార్డులు జారీ కాలేదు. గతంలో మీ సేవ కేంద్రాల్లో, కలెక్టరేట్లలో నిర్వహించే గ్రీవెన్స్ సెల్‌‌‌‌లో అప్లికేషన్ ఇచ్చినా బీఆర్ఎస్ సర్కార్ స్పందించలేదు. దీంతో పెండ్లై సపరేట్ ఫ్యామిలీ అయినా కూడా చాలా మంది మహిళల పేర్లు వారి పుట్టింటి రేషన్ కార్డులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే పెళ్లి చేసుకున్నాక కొత్త కార్డుల కోసం అప్లై చేసుకున్న యువకులు.. తమ తల్లిదండ్రుల రేషన్ కార్డులో తమ పేరును డిలీట్ చేయించుకున్నారు. 

ఇలా కొందరికి కొత్త కార్డులు రాక, పాత వాటిల్లో పేర్లు డిలీటై అనేక సంక్షేమ పథకాలకు దూరమయ్యారు. మరో వైపు కార్డు ఉన్న దంపతులకు పిల్లలు పుడితే వారి పేర్లు చేర్చే ఆప్షన్ ఇవ్వలేదు. కొందరు మీ సేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో ఎంట్రీ చేసిన పిల్లల పేర్లు ఫుడ్ సెక్యూరిటీ కార్డు వెబ్​సైట్ లో చూపెట్టడం లేదు. టెక్నికల్ కారణాలతో కుటుంబంలో ఒకరిద్దరి పేర్లు డిలీట్ అయ్యాయి. దీంతో రేషన్ కార్డులో పేర్లున్నా ఆన్ లైన్ లో లేని కారణంగా డీలర్లు రేషన్​ బియ్యం ఇవ్వడం లేదు. 

మరో 20వేల అప్లికేషన్లు వచ్చే చాన్స్

బీపీఎల్​పరిధిలో ఉన్నవారికే ప్రభుత్వం తెల్ల రేషన్ కార్డులను మంజూరు చేస్తోంది. అందుకే గతం నుంచి ఇప్పటివరకు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా అన్ని సంక్షేమ పథకాలకు వైట్ రేషన్ కార్డు కలిగి ఉండడమే అర్హతగా పరిగణిస్తున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు వైట్ రేషన్ కార్డే  అర్హతగా ప్రకటించిన విషయం తెలిసిందే. 

దీంతో గత ఐదారేళ్లలో పెళ్లయి, పిల్లలయిన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలో 18 వేలకుపైగా జంటలు రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకుని ఉండగా, గురువారం నుంచి గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహించే ప్రజాపాలన సభల్లో మరో 20 వేలకుపైగా అప్లికేషన్లు వచ్చే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.