కరీంనగర్: అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం (జనవరి 22) కరీంనగర్ జిల్లాలోని నారాయణపూర్లో నిర్వహించిన గ్రామ సభ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని స్పష్టం చేశారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నలభై వేల మందికి మాత్రమే రేషన్ కార్డులు ఇచ్చారని.. కానీ మేం అర్హులందరికి రేషన్ కార్డులు ఇస్తామన్నారు.
నలభై లక్షల రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. రేషన్ కార్డుల ద్వారా ఆరు కిలోల సన్నబియ్యం ఉచితంగా ఇవ్వబోతున్నామని రాష్ట్ర ప్రజలకు మంత్రి గుడ్ న్యూస్ చెప్పారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పారు. వ్యవసాయయోగ్యమైన భూములకి ఏడాదికి రూ.12 వేలు.. భూమిలేని రైతు కూలిలకి కూడా ఏడాదికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నామని తెలిపారు.
Also Read :- కాళేశ్వరం పైసలతో.. పేదలందరికీ ఇండ్లు వస్తుండే
ఇక, ఏండ్లుగా పెండింగ్లో నారాయణ పూర్ రిజర్వాయర్ పూర్తిచేసి తీరుతామని హామీ ఇచ్చారు. నారాయణపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి కావాలసిన నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ప్రాజెక్టు ద్వారా ఇబ్బందులు పడే ముంపు గ్రామాల సమస్యలు పరిష్కరించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించాలనేది మా ప్రభుత్వ పాలసీ అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం లక్షల కోట్లు ఖర్చు చేసి తక్కువ ఆయకట్టుకు నీరు ఇచ్చిందని దుయ్యబట్టారు.