రేషన్ ​కార్డుల్లో నాలుగు వేల మందికి పైగా పేర్ల తొలగింపు

రేషన్ ​కార్డుల్లో నాలుగు వేల మందికి పైగా పేర్ల తొలగింపు
  • రేషన్ ​కార్డుల్లో నాలుగు వేల మందికి పైగా పేర్ల తొలగింపు
  • రేషన్ కోటా ఆపేసిన ఆఫీసర్లు
  • తాము చావలేదంటున్న లబ్దిదారులు
  • వివరాలు అప్ డేట్ చేసుకోవాలంటూ ఆఫీసర్ల సలహా

మహబూబ్​నగర్, వెలుగు : బతికున్నవాళ్లను కూడా రేషన్​ కార్డుల్లో అధికారులు చంపేశారు. కార్డుల్లోంచి వారి పేర్లను తొలగిస్తూ పేదలను నిత్యావసరాలకు దూరం చేశారు. కొద్ది నెలల కింద రేషన్​కార్డుల్లో ఉన్న లబ్ధిదారుల్లో ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేర్లను తొలగించాలని సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఫీల్డ్​ లెవెల్​లో ఎంక్వైరీ చేసి చనిపోయిన వారి లిస్టు తయారు చేసి పంపించాల్సిన కింది స్థాయి అధికారులు.. విచారణ జరపకుండా బతికున్నవారి పేర్లను కూడా చేర్చి పంపించారు. దీంతో చాలామందికి రేషన్​దక్కడం లేదు.  

ప్రతి ఊళ్లో ఐదారుగురి పేర్లు.. 
రాష్ర్టంలోని 33 జిల్లాల్లో 17,348 రేషన్​ షాపులు ఉండగా, వీటి పరిధిలో 90,10,215 రేషన్​ కార్డులున్నాయి. ఇందులో అంత్యోదయ కార్డులు 5,63,191, ఎఫ్​ఎస్​సీ కార్డులు 84,41,429, అన్నపూర్ణ కార్డులు 5,595 ఉన్నాయి. ఈ కార్డుల యూనిట్లకు సంబంధించి చనిపోయిన వారి వివరాలను సేకరించాలని రాష్ర్ట ప్రభుత్వం ఎనిమిది నెలల కింద ఆదేశించింది. ఈ మేరకు స్థానిక ఆఫీసర్లు ఫీల్డ్​లెవెల్​కు వెళ్లకుండానే తెలిసిన వారిని అడిగి వారు చెప్పిన వివరాల ప్రకారం రిపోర్టు తయారు చేశారు. దీన్ని సివిల్​సప్లయ్​కమిషనరేట్​కు పంపారు. ఈ నివేదికను ఫైనలైజ్​చేసి రెండు నెలల కింద జిల్లాల సివిల్​సప్లయీస్​ఆఫీసర్లకు పంపగా, వారు రేషన్​డీలర్లకు అందజేశారు. 

ఒకరు చనిపోతే మరొకరి పేరు
క్షేత్ర స్థాయికి వెళ్లకపోవడం మూలంగా కుటుంబంలో ఒకరు చనిపోతే మరొకరి పేరు రిపోర్టులో పేర్కొన్నారు. ఉదాహరణకు మహబూబ్​నగర్​జిల్లా దేవరకద్రలోని బీసీ కాలనీకి చెందిన ఎల్లమ్మ (80) చనిపోతే ..ఆమె మనుమరాలు జయశ్రీ చనిపోయినట్లు పేరు తొలగించారు. ఇదే మండలం గూరకొండలో దాసరి కుర్మన్న (94) చనిపోగా, ఈయన కొడుకు పెంటప్ప చనిపోయినట్లు పేరు తీసేశారు. గండీడ్​మండలం సాలార్​నగర్​కు చెందిన బంటు హనుమయ్య పోయిన నెల రేషన్​ తీసుకున్నాడు. కానీ, ఈయన పేరు చనిపోయిన వారి లిస్టులో వచ్చింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా వేల మంది బతికే ఉన్నా.. వీరి పేర్లను చనిపోయిన వారి లిస్టులో చేర్చారు. దీంతో వీరికి ఈ నెల కోటా రాలేదు. అయితే, ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తున్న క్రమంలో మిస్టేక్ జరిగి ఉండవచ్చని సివిల్​సప్లయీస్​ఆఫీసర్లు చెబుతున్నారు.

రేషన్​షాపులకు పోతేనే తెలుస్తుంది
రేషన్​బియ్యాని ప్రతి నెలా 4వ తేదీ నుంచి రాష్ర్టంలో లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. దీంతో గత ఆరు రోజుల నుంచి ఆయా ఊళ్లలో రేషన్​తీసుకోవడానికి లబ్ధిదారులు వెళ్తుండగా ‘మీరు బతికే ఉన్నరా? సచ్చిపోయిన లిస్టుల మీ పేరున్నది’ అని డీలర్లు చెబుతున్నారు. ఈసారి మీ కోటా రాలేదని చెబుతుండడంతో డీలర్లతో గొడవకు దిగుతున్నారు. ఈ విషయాన్ని డీలర్లు జిల్లాల సివిల్​సప్లయీస్​ఆఫీసర్లకు చేరవేస్తున్నారు. తమ దగ్గరకు బతికే ఉన్నామంటూ వచ్చిన వారి వివరాలు తీసుకుని ఆఫీసర్లకు అందజేస్తున్నారు. దీంతో ఆపరేటర్లు ఆన్​లైన్​లో వీరి పేర్లు రీ స్టోర్​ చేస్తున్నారు. ఇలా తెలంగాణవ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి 4,152 మంది పేర్లను రీ స్టోర్​ చేసినట్టు సమాచారం.  

బతికున్నట్టు నిరూపించుకోవాల్సిందే
ఈ నెల పోతే పోనియ్​...వచ్చే నెల నుంచైనా రేషన్​వస్తుందనుకుంటే వివరాలు అప్​డేట్​చేసుకుంటేనే వీలవుతుందంటున్నారు అధికారులు. ఆధార్​కార్డు, ఇతర పత్రాలతో మీ సేవా కేంద్రాల్లో వివరాలు అప్​డేట్​చేసుకోవాల్సి ఉంటుందంటున్నారు. అలా కాకున్నా రేషన్​షాపుల వద్దకు ఆధార్​కార్డు తీసుకుపోతే వేలిముద్ర తీసుకుని బయోమెట్రిక్​ద్వారా అప్​డేట్​చేస్తారని ఆఫీసర్లు చెబుతున్నారు. కానీ, డీలర్లకు దీనిపై అవగాహన లేకపోవడంతో అప్​డేట్​చేయలేకపోతున్నారు. ఆఫీసర్లు కూడా డీలర్లకు శిక్షణ ఇవ్వడం లేదు. దీంతో చాలా మంది మీ సేవా కేంద్రాలకు వెళ్లి తాము బతికే ఉన్నామని వివరాలు చెబుతున్నారు.  

అప్​డేట్​చేసుకుంటే రీస్టోర్ అవుతుంది
కొన్ని జిల్లాల్లో చనిపోయిన వాళ్లనే కాకుండా, బతికున్న వారి పేర్లు కూడా చనిపోయిన వారి లిస్టులో వచ్చాయి. ఇది టెక్నికల్ మిస్టేక్. కార్డుల్లో పేర్లు లేని వారు ఉంటే ఆధార్ కార్డుతో రేషన్​షాపులకు లేదా మీ సేవా సెంటర్లకు వెళ్లి అప్​డేట్​చేయించుకోవాలి. వారి పేర్లు మళ్లీ రీ ప్లేస్​అవుతాయి. ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
–బాలరాజు, డీఎస్​ఓ, మహబూబ్​నగర్

ఆధార్, వేలిముద్ర​తీసుకోమన్నారు..
నా రేషన్​షాపు పరిధిలో ఉన్న కొందరి పేర్లు చనిపోయిన వారి లిస్టులో వచ్చాయి. వీరి కోటా బియ్యం రాలేదు. ఈ విషయాన్ని తహసీల్దార్​ఆఫీస్​లో చెప్పిన. పై నుంచే లిస్ట్​వచ్చిందని అన్నారు. పేర్లు మిస్​అయిన వారి ఆధార్​కార్డు తీసుకొస్తే, బయోమెట్రిక్​ద్వారా వేలిముద్ర తీసుకుని వారి పేర్లను రీప్లేస్​చేసుకోవాలని చెప్పారు. కానీ, ఈ నెలా కోటా బియ్యం రాదన్నారు.  
–గోపాల్​గౌడ్, సాలార్​నగర్​రేషన్​డీలర్, గండీడ్​మండలం