జనవరి 26 నుంచి రేషన్ కార్డులు.. ‘ఇందిరమ్మ’ లబ్ధిదారుల ప్రకటన  : మంత్రి పొన్నం ప్రభాకర్

  • స్థలాలు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఎలా ఇవ్వాలన్న దానిపై చర్చిస్తాం
  • ఖాళీగా ఉన్న డబుల్ బెడ్​రూం ఇండ్లనూ అందజేస్తాం
  • ఆరు నూరైనా అర్హులకే ఇస్తాం  
  • సమీక్షా సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్​

హైదరాబాద్ సిటీ, వెలుగు : రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల పంపిణీకి సంబంధించి ఈ నెల 25వ తేదీలోగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, 26 నుంచి అర్హులైన వారికి పంపిణీ చేస్తామని హైదరాబాద్ జిల్లా ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆదివారం గ్రేటర్ పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి బల్దియా హెడ్డాఫీసులో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి పొన్నం మాట్లాడారు.

గత ప్రభుత్వం పదేండ్లల్లో ఒక్క కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ సర్కారు ఏర్పడ్డాక అర్హులైన నిరుపేదలను గుర్తించి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. అందుకోసం ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులు తీసుకున్నామని, అర్హులకే పథకాలు అందాలన్నది తమ సర్కారు లక్ష్యమన్నారు. అందుకే కొంత సమయం తీసుకుంటున్నామన్నారు.  

అప్లికేషన్ల వెరిఫికేషన్​50 శాతం పూర్తి

ప్రజాపాలనలో10,70,463 అప్లికేషన్లు రాగా ఇప్పటివరకు 50 శాతం సర్వే పూర్తయ్యిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఐదు లక్షల అప్లికేషన్లలో ఇంటి స్థలం ఉన్నవారు 9,913 మంది ఉన్నారని తేలిందని, సర్వే పూర్తి చేసిన తర్వాత ఎంతమంది అర్హులు ఉన్నారన్నది తెలుస్తుందన్నారు. అర్హులకు మల్టీ స్టోర్ కట్టించడమా లేక స్లమ్స్ డెవలప్ చేసి ఇండ్లు నిర్మించడమా అన్నది యాక్షన్ ప్లాన్ తయారు చేస్తామన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామని, ఇండ్లు లేవని ప్రజాపాలనలతో దరఖాస్తు చేసుకున్నవారి గురించి సర్వే చేస్తున్నామన్నారు. అర్హులైన వారికే ఇండ్లను మంజూరు చేస్తామన్నారు. వీరికి ఖాళీగా ఉన్న డబుల్ బెడ్​రూం ఇండ్లు ఇవ్వడంతోపాటు సర్కారు స్థలాల్లో ఇండ్లు కట్టించి ఇచ్చేలా ప్రణాళిక తయారు చేస్తున్నామన్నారు. అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను పూర్తి చేస్తామన్నారు.

20 నుంచి 24 వరకు వార్డుల్లో సభలు

రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు నిరంతర ప్రక్రియ అని మంత్రి పొన్నం తెలిపారు. ప్రజాపాలనలో అప్లయ్​చేసుకున్న వారికి రేషన్​కార్డులు ఇవ్వడానికి 16వ తేదీ నుంచి 20వ తేదీ మధ్య ఫీల్డ్ వెరిఫికేషన్ జరుగుతుందన్నారు. ఆ లిస్ట్​ఆధారంగా 20 నుంచి 24వ తేదీ మధ్య వార్డుల వారీగా సభలు ఏర్పాటు చేసి లబ్ధిదారుల ఎంపిక చేస్తారన్నారు.  21వ తేదీ నుంచి 25వ తేదీ మధ్య డేటా ఎంట్రీ పూర్తవుతుందన్నారు.26 నుంచి రేషన్​కార్డులు అందజేస్తామన్నారు. 

ముంబై తరహా విధానం అమలు చేయాలి : ఎంపీ అసద్​

ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ సర్వే పూర్తయిన 50 శాతంలో ఇంటి స్థలం ఉన్నవారు 9,913 మంది ఉన్నారని తేలిందని, అంటే 1.8 శాతం మాత్రమే అర్హత సాధించారని, ఇంకా 98 శాతం మందికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసే అవకాశం లేదన్నారు. దీనికి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోందో చెప్పాలన్నారు. ముంబైలో స్లమ్ డెవలప్​మెంట్ కింద కొన్ని సంస్థలు సీఎస్ఆర్​లేదా పీపీపీ మోడ్ లో ముందుకు వచ్చి ఇల్లు నిర్మిస్తాయని, ఆ విధంగా హైదరాబాద్ లో నిర్మించే వారిని ప్రోత్సహించాలన్నారు.

ముంబై మోడల్ లో మలక్ పేట నియోజక వర్గంలో స్టార్ట్ చేస్తే సహకరిస్తామన్నారు. ప్రజాపాలన అప్లికేషన్లలో రేషన్ కార్డు కోసం ప్రత్యేకంగా అడగలేదని, దీంతో చాలామంది దరఖాస్తు చేసుకోలేదన్నారు. వారందరినీ గుర్తించి ఇవ్వాలన్నారు. సర్వేలో కిరాయిదారుడిని గుర్తించడం లేదని, సర్వే చేసేవారు ఇంటింటికీ వెళ్లకుండా ఒకే చోట కూర్చొని సర్వే చేస్తున్నారన్నారన్నారు. అర్బన్ లో రూ.5 లక్షల ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని రేషన్ కార్డు జారీ చేయాలని పలువురు ఎంఐఎం ఎమ్మెల్యేలు కోరారు.

రేషన్​కార్డుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి: ఎమ్మెల్యేలు

తలసేమియా, డయాలిసిస్ , క్యాన్సర్​వ్యాధిగ్రస్తులకు రేషన్ కార్డుల జారీలో ప్రాధాన్యం ఇవ్వాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. సర్వే పై జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేలను ఇన్వాల్వ్ చేయాలని, గతంలో డబుల్ బెడ్​రూం ఇండ్లల్లో ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేయకుండా లక్కీ లాటరీ ద్వారా కేటాయించారన్నారు. దీనివల్ల నిరుపేదలకు న్యాయం జరగలేదన్నారు. మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడేవారిని ఉపేక్షించవద్దన్నారు. బల్దియా కమిషనర్​ఇలంబరితి మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇండ్ల సర్వే త్వరలోనే పూర్తి చేస్తానన్నారు.

కంటోన్మెంట్ లో కూడా సర్వే తొందరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కొన్ని సర్కిల్స్​లో అప్లికేషన్ ఇతర ప్రాంతాలకు బదిలీ అయిన వారిని వెంటనే  సంప్రదించి తిరిగి అదే సర్కిల్ కు బదిలీ చేయించి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సర్వే వివరాలు సర్వేకు సంబంధించిన మార్గదర్శకాలను పవర్​పాయింట్​ప్రజెంటేషన్​ద్వారా వివరించారు. రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, మీర్జా రియాజ్, హసన్ జాఫ్రీ, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.